నేడు ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన
AP Budget: పేదల సంక్షేమానికే అధిక కేటాయింపులన్న సర్కార్
AP Budget: ఇవాళ ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సంక్షేమం, అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ గత ఏడాది కంటే ఎక్కువ అంచనాలతో బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్ ప్రవేశ పెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఎన్నికల బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెడుతుంది ఏపీ సర్కార్. ఉదయం 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఈసారి కూడా ఎప్పటిలాగే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. మండలిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సాధారణ బడ్జెట్‌ను, వ్యవసాయ బడ్జెట్‌ను సిదిరి అప్పలరాజు ప్రవేశ పెట్టనున్నారు. గతేడాది రెండు లక్షల 56 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. కానీ ఈసారి మాత్రం సుమారు రెండు లక్షల 70 వేల కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు తెలిసింది.