విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై ఏపీ బీజేపీ కీలక నేతలు తలో మాట మాట్లాడడం హాట్ టాపిక్‌గా మారింది. అనుకూల వ్యతిరేక కామెంట్స్‌తో అయెమయ పరిస్థితులు నలకొన్నాయి. వైసీపీ, టీడీపీలు ఆందోళన చేసినంత మాత్రాన ప్రైవేటీకరణ ఆగదని బీజేపీ ఎంపీ సుజనా హాట్ కామెంట్స్ చేస్తే... ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు ఏపీ బీజేపీ వ్యతిరేకమని ఏపీ బీజేపీ చీఫ్ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీ స్టాండ్ ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపారు. షేర్ హోల్డర్లకు లాభాలు తెచ్చేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ విశాఖలోనే ఉంటుందని, వేరే దేశానికి తీసుకెళ్లేది కాదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఆందోళన చేసినంత మాత్రన ప్రైవేటీకరణ ఆగదని తేల్చేశారు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాత్రం ప్రైవేటీకరణకు నో చెబుతోంది. ఇదే అంశం మీద ఏపీ బీజేపీ చీఫ్ సంచలన కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఏపీ బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్ మాధవ్, పలువురు కేంద్రమంత్రులను కలిశారన్నారు. అయినప్పటికీ.. ఈ నెల 14న బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. జేపీ నడ్డా, ప్రధాని మోడీని కలిసి పరిస్థితులు వివరిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించుకోవాలని కోరతామని సోము వీర్రాజు అన్నారు.