Attacks On Women: ఈ సమాజం ఆడవాళ్లను బతకనివ్వదా?
Attacks On Women: తరాలు మారినా.. కొత్త చట్టాలు వచ్చినా.. అవే దాడులు.. అదే రక్తపు చరిత్ర.. ఈ సమాజం ఆడవాళ్లను బతకనివ్వదా.. ఇంకెన్ని గొంతులు తెగాలి.
Andhra Pradesh | తరాలు మారినా.. కొత్త చట్టాలు వచ్చినా.. అవే దాడులు.. అదే రక్తపు చరిత్ర.. ఈ సమాజం ఆడవాళ్లను బతకనివ్వదా.. ఇంకెన్ని గొంతులు తెగాలి. ఇంకెందరు ఆడపిల్లలు బలవ్వాలి. మొన్న విజయవాడలో దివ్య గొంతు కోసినప్పుడు దేశంలోని ఆడపిల్లల రక్తం ఉడికిపోయింది. ఎలాంటి సమాజంలో బతుకుతున్నాంరా అని ఈసడించుకున్నారు. మళ్లీ ఇప్పడు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లాలో ఓ కసాయి ప్రేమకు 17 ఏళ్ల బాలిక బలైంది.
మొన్న వరంగల్.. నిన్న విజయవాడ.. ఇప్పుడు విశాఖ. ప్రాంతమేదైన కారణం ఒక్కటే ప్రేమించని పాపానికి చంపేశారు. విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి మరో అమ్మాయి బలైంది. ప్రేమించిన అమ్మాయి దక్కడంలేదనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిలా మారి గొంతు కోసి ప్రాణాలు తీశాడు. గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకున్న వరలక్ష్మిని చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి అనే యువకుడు కొద్దిరోజులుగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఇటీవల ఆమె శ్రీనగర్‌కు చెందిన రామ్ అనే యువకుడితో చనువుగా ఉండడాన్ని అఖిల్ గమనించాడు. నాలుగు రోజుల క్రితం అతనితో గొడవ కూడా పడ్డాడు. శనివారం రాత్రి 10 గంటలకు శ్రీనగర్ సాయిబాబా గుడి వద్ద ఇద్దరూ మాట్లాడుకోవడాన్ని అఖిల్ చూశాడు. తీవ్ర ఆగ్రహానికి గురై, ఒక్కసారిగా కత్తితో బాలికపై దాడి చేశాడు. ఈ ఘటన చూసిన రామ్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తం మడుగులో ఉన్న బాలికను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే బాలిక ప్రాణాలు విడిచింది. అప్రమత్తమైన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అఖిల్, రామ్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇలా దేశంలో ఎక్కడో ఒక చోట అమ్మాయిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ కరువేనా.. ఈ రాక్షస క్రీడ ఆగే అవకాశమే లేదా.. ఆడపిల్లల కన్నీళ్లు ఇంకెన్నాళ్లు... ఇంకెన్నేళ్లు.. ప్రేమికులరా ఇప్పటికైనా మారండి. మనుషులుగా బతికి చావండి.