Andhra Pradesh: హీటెక్కిన ఏపీ పాలిటిక్స్‌

*రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీ దీక్షలు *మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో చంద్రబాబు నిరసన దీక్ష

Update: 2021-10-21 02:55 GMT

ఆంధ్ర ప్రదేశ్ (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీ పాలిటిక్స్‌ మరోసారి హీటెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడితో రాజకీయాలు రంజుగా మారాయి. అధికార, ప్రతిపక్షాలు నిరసన దీక్షలకు పిలుపునిచ్చాయి. టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, నిరసన దీక్షకు దిగగా సీఎం జగన్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ జనాగ్రహ దీక్ష పేరుతో రెండ్రోజుల పాటు అధికార వైసీపీ నిరసన తెలియజేయనుంది.

మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉదయం 8 గంటలకు దీక్షను ప్రారంభించారు చంద్రబాబు. వైసీపీ నేతలు, కార్యకర్తల దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నీచర్‌ మధ్యలోనే కూర్చొని దీక్ష చేస్తున్నారు. రేపు రాత్రి 8 గంటల వరకు 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. దీక్షకు మద్దతుగా టీడీపీ ఆఫీస్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మరోవైపు దీక్షలో కోవిడ్‌ నిబంధనలు పాటించాలని నేతలకు గుంటూరు అర్బన్‌ పోలీసులు నోటీసులిచ్చారు.

ఇదిలా ఉంటే ఏపీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారు చంద్రబాబు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, డ్రగ్స్‌, హెరాయిన్‌ అంశాలపై ప్రశ్నించారనే కారణంతో ప్రతిపక్షాలపై దాడులు చేశారని లేఖలో వివరించారు. ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్ర బలగాలతో ప్రతిపక్ష పార్టీ నాయకులకు, పార్టీ కార్యాలయాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ దాడులకు సంబంధించిన ఫోటోలు, ధ్వంసమైన పార్టీ కార్యాలయం వీడియోలు, దాడుల్లో గాయపడిన టీడీపీ నేతల ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్స్‌ను ఆ లేఖకు అటాచ్ చేసి పంపారు చంద్రబాబు.

ఇక శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను వివరించనున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టు సమాచారం. అయితే 36 గంటల దీక్ష అనంతరం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరి వెళ్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. టీడీపీ ఆఫీస్‌లపై దాడుల గురించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు పరిస్థితుల గురించి వివరించనున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News