Visakhapatnam: విశాఖ జిల్లాలో 80 రోజులుగా మత్స్యకారుల ఆందోళనలు
Visakhapatnam: హెటిరో ఫార్మా కంపెనీ పైపులైన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, కొత్త పైపులైన్లు పూర్తిగా తొలగించాలని గంగపుత్రుల డిమాండ్.
Visakhapatnam: కష్టమొచ్చినా నష్టమొచ్చినా గంగమ్మ తల్లినే నమ్ముకుని బతికే మత్స్యకారులు వేట సాగక, పూటగడవక సతమతమవుతున్నారు. 80 రోజులుగా, ఆరు గ్రామాల గంగపుత్రులు ఉద్యమబాట పట్టారు. పీల్చే గాలి, తాగే నీరు రోజురోజుకు ప్రాణాంతకంగా మారుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో రసాయనాలు విడుదల చేసే పైప్ లైన్లు వేయమని స్పష్టమైన హామి ఇచ్చే వరకు తగ్గేది లే అంటూ హెచ్చరిస్తున్నారు.
విశాఖ జిల్లా నక్కపల్లిలోని హెటిరో పైప్‌లైన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కంపెనీ పరిసర గ్రామాల మత్స్యకారులు 80 రోజులుగా వివిధ రూపాల్లో తమ గళాన్ని వినిపించారు. ధర్నాలు చేశారు. ర్యాలీలు నిర్వహించారు. శాంతియుతంగా దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు హెటిరో డ్రగ్స్ కంపెనీ దిగొచ్చింది. కంపెనీ వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు ఇటీవల వేసిన పైపులైన్‌ను తొలగించే చర్యలు కంపెనీ యాజమాన్యం చేపట్టింది. మరో వైపు గంగపుత్రులు ఉద్యమానికి అన్ని పార్టీలు నుంచి మద్దతు లభించడంతో హెటిరో యాజమాన్యం దిగివచ్చింది. ఇటీవల వేసిన పైప్‌లైన్‌ను తొలగించింది. అయినా మత్స్యకారులు తమ దీక్షలను విరమించలేదు.
హెటిరో యాజమాన్యం పైప్‌లైన్ తొలగించడంతో ఆందోళన విరమించాలని పోలీసులు చెప్పారు. అయితే భవిష్యత్తులో పైపులైన్ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని మత్స్యకార నాయకులు ముక్తకంఠంతో తేల్చి చెప్పేశారు. హెటిరో రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లనుందని గంగపుత్రులు మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం స్పందించి భవిష్యత్తులోను పైపులైన్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టమైన హామీ ఇచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు.