Computer Training from 8th Class in AP: ఏపీ విద్యలో కీలక అడుగులు.. 8 నుంచే కంఫ్యూటర్ లో శిక్షణ
Computer Training from 8th Class in AP: ఏపీలో విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Computer Training from 8th Class in AP: ఏపీలో విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక పక్క భవనాలను అధునాతకంగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం విశేషంగా పాటు పడుతోంది. దీనిపై విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ పలు విషయాలను వెల్లడించారు. విద్యాశాఖలో నాణ్యతా ప్రమాణాలు పెంచే అంశంపై దృష్టి పెట్టామని విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ పేర్కొన్నారు. ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 8వ తరగతి నుంచి కంప్యూటర్ శిక్షణ కూడా ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. అలాగే కెరీర్ కౌన్సిలింగ్ కూడా దశల వారిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని.. 8వ తరగతి నుంచి వారికి మౌలికమైన అంశాలతో కూడిన విద్యాబోధన ఉంటుందని మంత్రి తెలిపారు. గత ఏడాగా మౌలిక సదుపాయాలు పెంచటంపై నిధులు ఖర్చు చేశామన్నారు. ఇక నుంచి విద్యాశాఖలో సంస్థాగత మార్పులపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
సమీక్షలో విద్యావిధానంపై కూడా చర్చించామన్నారు. కొత్తగా కొందరు డైరెక్టర్‌ల స్థాయిలో అధికారుల నియామకం జరగాల్సి ఉందని సీఎం వైఎస్ జగన్‌కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. ఆంగ్ల మాధ్యమం, అలాగే పాఠ్య పుస్తకాలకు ఇతర విభాగాలకు ప్రత్యేక అధికారులు కావాలని కూడా చెప్పామన్నారు. శాశ్వత ప్రాతిపదికన మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో శుభ్రత పై పర్యవేక్షణకు కూడా డైరెక్టర్ స్థాయి అధికారి ఉండాలని వివరించామన్నారు. ప్రాధమిక విద్య హాస్టళ్లలో డీఈఓ స్థాయి అధికారి ఉన్నా అదనపు బాధ్యతలు కోసం జాయింట్ డైరెక్టర్ స్థాయిలో అధికారులు కావాలని.. రాబోయే రోజుల్లో 25 జిల్లాలు అయితే వాటికి అధికారులు కావాలని సురేష్ తెలిపారు.
8వ తరగతి నుంచే కంప్యూటర్ శిక్షణ
'అకడమిక్ ఆడిటింగ్ జరగాల్సి ఉంది. పాఠశాల కాంప్లెక్స్‌లు ఏర్పాటు కూడా చేయాలని భావిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి ప్రిప్రైమరీ విద్య కూడా ప్రవేశపెడతాం. 11 వేల పైచిలుకు అంగన్ వాడి కేంద్రాల్లో 7 వేలకు పైగా పాఠశాలలోనే ఉన్నాయి. కిండర్ గార్డెన్ విద్య వచ్చే ఏడాది నుంచి మొదలు పెడతాం. దీని సిలబస్‌పై కూడా తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యాం. 156 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు. ఇక్కడ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్ళాం. చాలా కళాశాలలో పోస్టులు లేవు. ఈ ఖాళీలను కూడా భర్తీ చేస్తాం. అధ్యాపకుల శిక్షణపై కూడా దృష్టి పెట్టాం. ప్రతి జిల్లాల్లో టీచర్ ట్రైనింగ్ కేంద్రాలుగా మారుస్తాం. డైట్ కేంద్రాలను దీనికోసం వినియోగిస్తాం. యూనిఫైడ్ సర్వీసుల అంశం ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు పాఠశాలల నాణ్యత తనిఖీ చేసి అక్రెడిషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
ప్రతి ఏటా వారి పనితీరు మదింపు ఉంటుంది. ఇంటర్‌తో పాటు, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ఈ కార్యాచరణ ఉంటుంది. నాడు నేడు 3 దశల్లో పూర్తి చేస్తాం. 8 తరగతి నుంచి కంప్యూటర్ శిక్షణ కూడా ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అలాగే కెరీర్ కౌన్సిలింగ్ కూడా దశల వారిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 8వ తరగతి నుంచి వారికి మౌలికమైన అంశాలతో కూడిన విద్యాబోధన ఉంటుంది. దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తాం. బ్రెయిలి పుస్తకాలు కూడా ఇస్తాం. ప్రస్తుతం రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు ముద్రించాం. ఈ విద్యా సంవత్సరం నుంచే వర్క్ పుస్తకాలు కూడా ఉంటాయి. వర్చువల్ క్లాస్ రూమ్, ఇంగ్లీష్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేస్తాం' అని మంత్రి ఆదిమూలపు మీడియాకు వెల్లడించారు.