ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మాట తప్పారా మడమ తిప్పారా వాగ్దాన భంగం చేశారా అమ్మ ఒడిపై విద్యాశాఖ మంత్రి సురేశ్ ఇచ్చిన స్పష్టత చూస్తుంటే కలిగే సందేహాలు ఇవే. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అందరికీ బదులుగా అర్హులైన నిరుపేదలకే ఇవ్వడం మంచిదా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకే ఇలా చేశారా లాంటి అంశాలన్నీ తెరపైకి వచ్చాయి.
ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలు ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించేందుకు తోడ్పడ్డాయనడంలో సందేహం లేదు. ఎక్కడ చదువుతున్నారన్న దానితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికీ ఏటా 15 వేల రూపాయల సాయం చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. తాజా సమాచారాన్ని బట్టి చూస్తుంటే ఈ సాయం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఈ పరిణామం సమాజంలోని భిన్న వర్గాలను ఎలా ప్రభావితం చేయనుంది ఎవరెలా స్పందించనున్నారు లాంటి అంశాలు ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారాయి.
ప్రేమలో, యుద్ధంలో నెగ్గేందుకు ఏం చేసినా తప్పు లేదు అని ఓ సామెత. ఎన్నికలు కూడా ఓ యుద్ధం లాంటివే. ప్రజలకు ఇచ్చే వాగ్దానాలే పార్టీలు సంధించే అస్త్రాలు. మరి పార్టీలు ఆ వాగ్దానాలను అమలు చేయకపోతే వాగ్దానాలకు షరతులు విధిస్తే అలాంటి పరిణామాలను ఎలా చూడాలన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు అప్పులే మిగిలాయి. ఎన్నికలకు ముందు ఆ విషయం అటు టీడీపీకి, ఇటు వైసీపీకి తెలుసు. అయినా కూడా రెండు పార్టీల నాయకులూ ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికల్లో గెలిచిన తరువాత మాత్రం వైఎస్ జగన్ కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థమైంది. ఖాళీ ఖజానాతో చేయగలిగింది ఏదీ లేదని తెలిసిపోయింది. అయినా కూడా మొండి ధైర్యంతోనే ముందుకెళ్తున్నారు కాకపోతే ఇచ్చిన వాగ్దానానికి కాస్త సవరణలు చేస్తున్నారు. వాగ్దానాలకు ఇలా సవరణలు చేయడం కొత్తేమీ కాదు. ఇచ్చిన హామీలను అసలు పట్టించుకోని రోజులు కూడా ఉన్నాయి. ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించడం కన్నా కొన్ని షరతులతో అమలు చేయడం కూడా మంచిదే. అదే సమయంలో ఆ సవరణల కారణంగా నష్టపోయే వర్గాలనూ ఏదో విధంగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అమ్మఒడి విషయంలో జరుగుతున్నది ఇదే.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ తో లక్షలాది పేద విద్యార్థులు ప్రయోజనం పొందిన మాట నిజం. అదే సమయంలో కాలేజీల యాజమాన్యాలు కూడా బాగా లాభపడ్డాయి. మరోవైపున కాలేజీలకు కార్లలో వచ్చే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రయోజనాలు దక్కడంపై మాత్రం విమర్శలు వెలువడ్డాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి ఉదాత్త పథకంతో ఆశించిన ఫలితాలు పొందాలంటే కొన్ని షరతులు విధించక తప్పదనే వాదనలూ వచ్చాయి. తాజాగా అమ్మఒడి విషయంలోనూ అలానే జరిగింది. అమ్మఒడి పథకం గురించి చర్చించాలంటే రాష్ట్రంలో ఇప్పటికే ధ్వంసమైన ప్రాథమిక విద్య గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక విద్యపై రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఎంతో పోటీని తట్టుకొని అర్హులైన వారే ప్రభుత్వ ఉపాధ్యాయులవుతున్నారు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, మౌలిక వసతులు, ప్రమాణాలు బాగానే ఉన్నాయి. మరో వైపున ప్రైవేటు రంగంలో కొన్ని పాఠశాలలు మాత్రమే రాణిస్తున్నాయి. మిగిలిన ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రమాణాలు అంతంత మాత్రమే. అయినా కూడా ఎంతో మంది పేదలు, దిగువ మధ్యతరగతి వారు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. నిరుపేదలతో పాటుగా ప్రైవేటు పాఠశాలలు అందుబాటులో లేని వారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో నిరుపేదలే అధికం. ప్రభుత్వ సాయం తొలిగా అందాల్సింది సమాజంలో అత్యంత నిరుపేదలకు మాత్రమే. ఆ తరువాత దశల వారీగా ఇతరులనూ ఆ పథకంలో భాగస్వాములుగా చేయవచ్చు. ఆ లెక్కన చూస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయడంలో తప్పు లేదనే వాదన వినిపిస్తోంది.
ఇంజినీరింగ్ కాలేజీలలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో ప్రైవేటు కాలేజీలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాయి. అమ్మఒడి పథకాన్ని గనుక ప్రైవేటు పాఠశాలలకూ వర్తింపజేస్తే అలాంటి అక్రమాలు చోటు చేసుకోవన్న గ్యారంటీ లేదు. అమ్మఒడి పథకం తమకూ వర్తిస్తుంది కాబట్టి తమ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చాల్సిందిగా ప్రైవేటు పాఠశాలలు ఉధృత ప్రచారం చేశాయి. అలాంటి ప్రచారాన్ని ఆపేయాల్సిందిగా విద్యాశాఖాధికారులు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దగలదు. అలాంటి ప్రయత్నాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఇంగ్లీషు మీడియం పాఠశాలలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఆ పాఠశాలల్లో విద్యార్థులు చేరితేనే అందుకు సార్థకత లభిస్తుంది. అందుకోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించినా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రైవేటు పాఠశాలలకూ, చదువుకునే ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తే సాయం అవసరం లేని వారికి కూడా ప్రభుత్వ సాయం అందుతుంది. అది అమ్మఒడి అసలు లక్ష్యాన్ని పక్కదోవ పట్టించినట్లే అవుతుంది. ప్రజాకర్షక పథకాలకు, సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖ అతి పల్చటిది. ప్రజాకర్షక పథకాలతో ప్రభుత్వ ఖజానాకు చేటు. వాటిని సంక్షేమ పథకాలుగా మారిస్తేనే అర్హులకు ప్రయోజనం కలుగుతుంది. మరో పక్కన కొందరు తల్లితండ్రులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల ప్రతినిధులు మాత్రం అమ్మఒడి పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ నిధులంటే పప్పుబెల్లాలు కావు ఉచితంగా అందరికీ పంచిబెట్టడానికి. ఆ నిధులు వచ్చేది కూడా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులతోనే. మళ్ళీ ఆ నిధులను అనర్హులకు అందిస్తే అపాత్ర దానం చేస్తే అందరిపై పన్నుల భారం పెంచకతప్పదు. అలాంటి పరిస్థితి రాకూడదనుకుంటే ప్రతీ ప్రభుత్వ పథకం కూడా అసలైన అర్హులకే దక్కేలా చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే అమ్మఒడిని వర్తింపజేస్తామనడంతో ప్రైవేటు పాఠశాలలకు షాక్ కొట్టినట్లయింది. భారీస్థాయిలో ప్రభుత్వ నిధులను దండుకోవచ్చనుకున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులను ఉసిగొల్పుతున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం పేదలకు సాయం అందిచడమే. ప్రైవేటు పాఠశాలల్లోనూ పేద విద్యార్థులు అనేకమంది ఉంటారు. అలాంటి వారికి దశలవారీగా ఈ పథకాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. అలాగాకుండా విద్యార్థులందరికీ ఈ పథకం అమలు చేస్తే ఖజానాపై భారం పెరుగుతుంది. చివరకు ప్రజలపైనే పన్నుల భారం మోపాల్సి వస్తుంది. పథకం భారం అయితే అది ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పై కూడా ప్రభావం చూపుతుంది. ప్రభుత్వపాఠశాల వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. అలా జరగడం మంచి పరిణామం కాదు.
ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం తప్పు కాదు. కాకపోతే ఆచరణ సాధ్యాసాధ్యాలు గమనించి వాగ్దానాలు చేయాల్సి ఉంటుంది. ఒక్క వాగ్దానం చేయడంలో వేసిన వెనుకంజ అప్పట్లో జగన్ ను విపక్షనేతగా మిగిల్చింది. రుణమాఫీ ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టగలిగారు. అయితే రుణమాఫీ చేయడంలోనూ చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రుణమాఫీ అమలు తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అమ్మఒడి కి కూడా ఆ దుస్థితి పట్టకూడదనుకుంటే కొన్ని షరతులతోనే దాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమానికే పెద్దపీట. అందులోనూ పేదలకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడే ప్రజాస్వామ్యానికి సార్థకత లభిస్తుంది. అలా చూసినప్పుడు అవసరమైతే సవరణలతో వాగ్దానాలను అమలు చేయడం తప్పు కాదు. షరతులు లేకుండా అపాత్ర దానం చేసేలా వాగ్దానాలను అమలు చేయడమే పెద్ద తప్పు అవుతుంది.