CM Jagan: ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్‌

Update: 2021-12-02 03:30 GMT

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

CM Jagan: వరద ప్రభావిత జిల్లాల్లో ఇవాళ, రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వరద ప్రభావిత కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న జిల్లాల్లో రెండు రోజులపాటు పర్యటిస్తారు. ఇవాళ ఉదయం 9గంటల 30 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు జగన్ బయలుదేరతారు. అనంతరం కడప జిల్లా రాజంపేటకు చేరుకుంటారు. అక్కడ నుంచి పులపొత్తూరు గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. సహాయశిబిరంలో ఉన్న బాధితులతో సీఎం ముఖామఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకోనున్న సీఎం అక్కడ నుంచి ఎగుమందపల్లి వెళ్లి గ్రామంలో వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో స్వయంగా కాలినడకన పర్యటిస్తారు.

ఎగుమందపల్లి నుంచి నేరుగా అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళ్తారు. దెబ్బతిన్న ప్రాజెక్టును సీఎం పరిశీలిస్తారు. వరద ప్రభావం ఫలితంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై సీఎంకు అధికారులు వివరించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, సహాయ చర్యలపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ కాలనీకి చేరుకుని, కాలనీ ప్రజలతో వరదనష్టంపై ముఖాముఖి, సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి పద్మావతి అతిధి గృహంలోనే సీఎం బసచేయనున్నారు.

Tags:    

Similar News