CM Jagan: జలవనరుల శాఖపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
CM Jagan: ముందస్తు వరదలతో పోలవరం పనులకు ఆటంకం
CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో వరదలపై జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గోదావరి మహోగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ ఏరియల్ వ్యూ నిర్వహిస్తారు. పోలవరం సహా ప్రాధాన ప్రాజెక్టులపై జగన్ సమీక్షించారు. ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై సీఎం ఆరా తీశారు. ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్–1, గ్యాప్–2లు పూడ్చే పనుల అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
గ్యాప్ 1, గ్యాప్ 2 పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరమని అధికారులు జగన్ కు వివరించారు. టెస్టులు, నివేదికలు పూర్తికాకముందే గోదావరి నదికి ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా దిగువ కాఫర్ డ్యాం ప్రాంతంలోకి వరద నీరు చేరిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్లని పనుల వేగవంతానికి 6వేల కోట్ల నిధులను రప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈమేరకు కేంద్రానికి లేఖలు రాయాలని సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించి హెడ్ వర్క్స్, కనెక్టివిటీ పనులపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు.