ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అమ్మఒడి పథకంలో భాగంగా రెండో విడత చెల్లింపులను సీఎం జగన్ ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రెండో విడత అమ్మఒడిలో భాగంగా 6వేల673 కోట్లను విడుదల చేశారు. మొత్తం 44లక్షల 48వేల 865 మంది తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమచేశారు.
పిల్లలను చదివించే శక్తి లేక చాలా మంది తల్లులు వారిని కూలి పనులకు పంపడాన్ని పాదయాత్రలో చూశానని, అందుకే అమ్మఒడికి రూపకల్పన చేశామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లలను బడికి పంపే తల్లికి 15 వేలు ఇచ్చామని, ఇప్పుడు రెండో విడత అమలు చేస్తున్నామని వివరించారు. చదువుకోవాలనుకునే ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష అని సీఎం జగన్ అభివర్ణించారు. ఈ పథకంలో భాగంగా 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థికసాయం అందిస్తామన్నారు.
వరుసగా రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామన్న సీఎం జగన్ నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నామన్నారు. అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నామన్నారు. గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
పాఠశాలకు విద్యార్ధి రాకపోతే మొదటి రోజు ఫోన్‌లో మెసేజ్ వరుసగా రెండు రోజులు రాకుంటే వాలంటీర్ నేరుగా ఇంటికొచ్చి విద్యార్ధి యోగక్షేమాలు తెలుసుకుంటారని వెల్లడించారు. పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రుల కమిటీలతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు, వాలంటీర్లపై ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో వంద శాతం పిల్లలు బడిబాట పట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే 1902 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని, గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని సీఎం సూచించారు.
విద్యార్ధులకు కంప్యూటర్ స్కిల్స్ పెంచేందుకు ల్యాప్‌టాప్ ఆఫర్ ప్రకటించారు సీఎం జగన్. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ఈ ఆఫర్ ప్రకటించారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్ ఇస్తామని తెలిపారు. 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌డిస్క్, విండోస్ 10 ఓఎస్ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్ ఉంటుందని వివరించారు.
ఆలయాల్లో దాడులపై సీఎం జగన్ స్పందించారు. ఎక్కడా ఒకచోట దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. గుళ్లను కూల్చేసి ఆలయాల భూములను కబ్జా చేస్తున్నారన్నారు. చీకట్లో విగ్రహాలను ఎవరు ధ్వంసం చేస్తున్నారో గమనించాలన్న జగన్ ఇవాళ గుళ్లను కూల్చేస్తున్నారు రేపు బడులను కూడా కూల్చేస్తారేమో..? నిఘా ఉంచాలన్నారు. ఆలయాల్లో క్షుద్రపూజలు చేసిన వారు దేవుడిపై భక్తి ఉన్నట్లు డ్రామాలాడుతున్నారన్నారు.