Vijayawada: శివారు ఇళ్లను టార్గెట్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్.. మారణాయుధాలు, కర్రలతో..
Vijayawada - Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ అలజడితో అప్రమత్తమైన పోలీసులు...
Vijayawada - Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటేనే విజయవాడ నగర వాసులు భయపడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇళ్లను, కాలనీల్లో నిర్మానుష్య ప్రాంతాల్లోని ఇళ్లే వీరి టార్గెట్. బనీయన్లు, చెడ్డీలు ధరించి, చేతిలో ఓ రాడ్‌తో చోరీలు చేయడం ఈ గ్యాంగ్ స్పెషల్. ఎలాంటి తాళమైన, డోర్‌నైనా ఒక్క రాడ్ సహాయంతోనే విరగొట్టడం ఈ చెడ్డీ గ్యాంగ్ స్పెషాలిటీ. ఇలా నగర శివారు ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రాంతాలలో వెలుస్తున్న కాలనీలను టార్గెట్‌గా చేసుకుంటూ వరుస చోరీలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్.
ఇటీవల విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ అలజడి సృష్టిస్తోంది. నగర శివారు గుంటుపల్లి గ్రామంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ఐదుగురు సభ్యుల ముఠా ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో కర్రలు, మారణాయుధాలతో చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించడం అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. అయితే ఈ దొంగల మూఠాను మూడు టీం లుగా ఏర్పాటు చేసి వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని అపార్ట్‌మెంట్‌లలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
సిటీలో ఇబ్రహీంపట్నం, భవానీపురం, కొత్తపేట ప్రాంతాలు ఎక్కువగా నగర శివారులను కవర్ చేస్తాయి. ఆ ప్రాంతాలలో గస్తీ కూడా ఎక్కువగా ఉంచాల్సిన పరిస్ధితి ఉంటుంది. చెడ్డీ గ్యాంగ్ విషయంలో ప్రజలు, అపార్ట్‌మెంట్ వాసులు జాగ్రత్తగా ఉండాలని, LED లైట్లు, లాకింగ్ సిస్టం, సెక్యూరిటీ సరిగా చూసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. అయితే నిందితులను పట్టుకునే పనితో పాటుగా, నగరంలో భద్రత, గస్తీ మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భవానీపురం సీఐ తెలిపారు.
మరోవైపు తాము కూడా అప్రమత్తంగా ఉన్నామని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, కొత్త వ్యక్తుల సంచారంపై దృష్టి పెడుతున్నామని చెబుతున్నారు. పోలీసులు తమకు అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు.
చెడ్డీ గ్యాంగ్ హల్ చల్‌తో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ శివారులోని అపార్ట్‌మెంట్‌లలో అవగాహన కల్పిస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు.