నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు ఉరితాడు అని పెట్టాల్సింది : చంద్రబాబు

Update: 2020-09-05 09:50 GMT

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, అప్పులు చేయడమే ప్రధానంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. కోర్టులు చివాట్లు పెట్టినా జగన్ తీరు మారటం లేదని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు.. ఉచిత విద్యుత్‌ ను యథాతథంగా పునరుద్ధరించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే... వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు.. రైతుల మెడకు ఉరితాళ్లే. రాష్ట్ర ప్రభుత్వ నయవంచక విధానాలు రోజుకొకటి చొప్పున బయటపడుతున్నాయి. ఆ విధానాలు ప్రజల పాలిట గుదిబండలుగా మారుతున్నాయి. సెప్టెంబర్ 1న వ్యవసాయ విద్యుత్ బోర్లకు నగదు బదిలీ పథకం పేరిట జీవోఎంస్ నెం.22 విడుదల చేశారు. నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు ఉరితాడు అని పెట్టాల్సింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది రైతుల హక్కే తప్ప.. మీరిచ్చే బిక్షం కాదు. ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు ఉచిత విద్యుత్ అన్నారే గానీ నగదు బదిలీ అని ఎక్కడా చెప్పలేదు. ఈ రోజు నగదు బదిలీ పేరుతో రైతు మెడకు ఉరితాడు వేయాలనుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 40 సంవత్సరాల పాటు రైతులంతా పోరాడి సాధించుకున్న హక్కు ఈ ఉచిత విద్యుత్. విద్యుత్ సంస్కరణకు శ్రీకారం చుట్టింది టీడీపీ హయాంలోనే. మొదటి సారిగా ఎన్టీఆర్ హయాంలో మొదలైన ఈ విధానం కాల క్రమేణా ఉచిత విద్యుత్తుగా మారింది. టీడీపీ ఆవిర్భావానికి ముందు రైతు విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లించలేక రైతులు నానా అవస్థలు పడ్డారు. సరైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో ఆ రోజు ఎన్టీఆర్ గారు స్లాబ్ రేట్ విధానాన్ని తీసుకొచ్చారు. రాయలసీమలోని రైతులు ఇతర మెట్ట ప్రాంతాల్లోని రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొనేవారు అని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News