Andhra Pradesh: జిన్నా టవర్ చుట్టూ రాజకీయాలు.. ఏపీలో కాకరేపుతున్న సత్యకుమార్ ట్వీట్
*జిన్నా టవర్‌పై స్పందించిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ *జిన్నా సెంటర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్
Andhra Pradesh: ఏపీ రాజకీయాలు గుంటూరులోని జిన్నా టవర్ చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీ నేత సత్యకుమార్ చేసిన ట్వీట్ కాకరేపుతోంది. గుంటూరులోని టవర్‌కు జిన్నా అని దేశద్రోహి పేరు ఎందుకు పెట్టారని సత్యకుమార్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. పాకిస్థాన్‌లో ఉండాల్సిన జిన్నా టవర్ పేరు గుంటూరులో ఎందుకు ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్పుచేశారని ఆయన గుర్తుచేశారు. ఇక్కడ పేరు మార్చితే తప్పేంటని ఆయన నిలదీశారు.
జిన్నా టవర్‌పై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. భారత దేశాన్ని ముక్కలు చేసిన దేశద్రోహి పేరు గుంటూరు జిల్లాలోని టవర్‌కు ఎందుకని ఆయన నిలదీశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహానుభావులు ఉన్నారని టవర్‌కు వాళ్ల పేర్లు పెట్టాలని సూచించారు. జిన్నా టవర్‌కు పేరు మార్చకుంటే టవర్‌ను కూల్చేస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.
గుంటూరు జిల్లాలో జిన్నా సెంటర్ పేరును మార్చాలని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు డిమాండ్ చేశారు. దేశ విద్రోహుల పేర్లు మరెక్కడ ఉన్నా తొలగించాలని సోమువీర్రాజు విజ్ఞప్తి చేశారు. ఎందరో భారతీయుల మరణానికి కారణమైన జిన్నా పేరును తొలగించడం దేశానికి అవమానకరమని సోమువీర్రాజు అన్నారు.