బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలా.. చర్యలు తీసుకొండి : విష్ణువర్ధన్ రెడ్డి
Vishnu Vardhan Reddy : బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలను చిత్రీకరించడం పట్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం
Vishnu Vardhan Reddy : బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలను చిత్రీకరించడం పట్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాజురాహో అనే కంపెనీ తన బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలను చిత్రీకరించినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అయితే దీనిపైన వెంటనే స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీటిని తక్షణమే నిషేధించి సదరు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాలని అయన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు..
ఈ మేరకు అయన తెలంగాణ సీఎంవో, ఆంధ్రప్రదేశ్ సీఎంవోలకి ఈ ట్వీట్ ని ట్యాగ్ చేశారు. అంతేకాకండా ఇతర మతాలకు సంబంధించిన ఇలా చేయగలరా అంటూ అయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. మద్యం సీసాలపై హిందూ దేవతల బొమ్మలు ఉపయోగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా హిందూ సమాజం కళ్లు తెరవాలి అంటూ అయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
అటు ఏపీలో తాజాగా అంతర్వేది ఆలయ రథం దగ్దమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసాయి.. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం రాష్ట్రంలోని పలు ఆలయాల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు చేసుకోవడం పట్ల విపక్షాలు ప్రభుత్వం పైన మండిపడుతున్నాయి.. ముఖ్యంగా బీజేపీ నేతలు ప్రభుత్వ వైఖరి పట్ల ఫైర్ అవుతున్నారు. తాజాగా బీరు సీసాల పైన దేవుళ్ల బొమ్మలను చిత్రీకరించినట్టుగా కనిపించడంతో వారిపైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.