BJP Leader Somu Veerraju on AP Three Capitals: రాజధాని విషయంలో మా జోక్యం ఉండదు..
BJP Leader Somu Veerraju on AP Capital: నాలుగు రోజుల క్రితం బీజేపీ ఏపీ శాఖ నూతన అద్యక్షునిగా నియమితులైన సోము వీర్రాజు రాజధానిపై ఆసక్తి కర ప్రకటన చేశారు.
BJP Leader Somu Veerraju on AP Capital: నాలుగు రోజుల క్రితం బీజేపీ ఏపీ శాఖ నూతన అద్యక్షునిగా నియమితులైన సోము వీర్రాజు రాజధానిపై ఆసక్తి కర ప్రకటన చేశారు. రాజధాని ఏర్పాటులో స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. దానికి బీజేపీ అడ్డుకాదన్నారు. అయితే అమరావతి రైతులకు అన్యాయం జరిగే విషయంలో న్యాయం జరిగే వరకు తాము పోరాటానికే కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతలు అనేవి పార్టీ నిర్ణయించే అంశాలని, అందరి సమన్వయంతో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని తెలిపారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు. ''చంద్రబాబు ప్రవర్తన మూలంగానే టీడీపీ ఓడిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరతాం. పోలవరానికి తప్పకుండా నిధులు తెచ్చేందుకు కృషి చేస్తాం. రాష్ట్రాభివృద్ధిలో బీజేపీ పాత్ర తప్పకుండా ఉంటుందని'' సోము వీర్రాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. రాజధాని పేరుతో సింగపూరు, జపాన్, చైనా అంటూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ.. కథలు చెప్పారని విమర్శించారు. చంద్రబాబు మాటలపై కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు కూడా మూడు రాజధానిలో విషయంలోనూ అదే వైఖరితో ఉన్నామని తేల్చిచెప్పారు. అయితే రాజధాని రైతులకు న్యాయం జరగాలన్న తమ నినాదానికి చివరి వరకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాజధానిపై టీడీపీ నేతలు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇక తాము సీరియస్‌గా ఉండబోతున్నామని తెలిపారు. బీజేపీ నేతలు తనకు దగ్గరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆటలో తాము సైతం కొత్త ఎత్తుగడలు వేస్తామని పేర్కొన్నారు. బీజేపీ-జనసేనకు 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు తాము భావిస్తున్నామని సోము వీర్రాజు చెప్పారు.