Yamini Krishnamurthy: యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
Yamini Krishnamurthy Dies | యామినీ కృష్ణమూర్తి శనివారం కన్నుమూశారు. ఆమె వయస్సు 84 ఏళ్లు. ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఆమె ప్రసిద్ది చెందారు. ఆమె పూర్తి పేరు మామినీ పూర్ణతిలకం.
యామినీ కృష్ణమూర్తి శనివారం కన్నుమూశారు. ఆమె వయస్సు 84 ఏళ్లు. ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఆమె ప్రసిద్ది చెందారు. ఆమె పూర్తి పేరు మామినీ పూర్ణతిలకం. అనారోగ్య సమస్యలతో దిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న ఆమె జన్మించారు. కృష్ణమూర్తి తండ్రి సంస్కృత పండితుడు. యామినీ కుటుంబం కొంతకాలం తర్వాత తమిళనాడులో స్థిరపడింది. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను నేర్చుకున్న ఆమె 1957లో తొలి ప్రదర్శన ఇచ్చారు. దిల్లీలో ఆమె యామినీ పేరుతో డ్యాన్స్ స్కూల్ ను నడుపుతున్నారు. దీనికి యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ గా పేరు పెట్టారు.
ఐదో ఏటనే భరత నాట్యం నేర్చుకున్న యామినీ
యామినీ కృష్ణమూర్తి తనకు ఐదేళ్ల వయస్సున్నప్పుడే భరత నాట్యం నేర్చుకున్నారు. చొక్కలింగం పిళ్లై, కాంచీపురం ఎల్లప్పపిళ్లై, బాలసరస్వతి, , దండాయుధపాణి, మైలాపూర్ గౌరి అమ్మ,తంజావూర్ కిట్టప్పలు ఆమెకు భరత నాట్యం నేర్పారు. చింతా కృష్ణమూర్తి, వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మల వద్ద కూచిపూడి నేర్చుకున్నారు.
విశ్వమోహిని పాత్రతో గుర్తింపు
క్షీరసాగరమధనం అనే నృత్యరూపకాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆకాశవాణి కోసం రాశారు. అయితే ఈ క్షీరసాగరమధనంలోని విశ్వమోహిని పాత్రలో యామినీ కృష్ణమూర్తి నటించారు. ఈ ప్రదర్శనలో ఆమె నటన పలువురిని మెప్పించింది. దీంతో అప్పటి నుంచి ఆమెను విశ్వమోహినిగా కూడా పిలిచేవారు. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ముందు కూడా ప్రదర్శించి భామావేణి అనే బిరుదును కూడా ఆమె పొందారు.
పలు దేశాల్లో నృత్య ప్రదర్శనలు
అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, బర్మా, సింగపూర్ వంటి దేశాల్లో ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చారు. రేణుకా ఖాండేకర్ సహకారంతో ఎ ఫ్యాషన్ ఆఫ్ డ్యాన్స్ అనే పేరుతో ఓ పుస్తకం కూడా ఆమె రాశారు. గతంలో ఆమె టీటీడీ ఆస్తాన నృత్యకారిణిగా కూడా ఉన్నారు.