Balineni Effect: వైసీపీలో బాలినేని ప్రకంపనలు.. ఆయన బాటలోనే సామినేని ఉదయభాను, కేతిరెడ్డి తదితరులు

Balineni Effect: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. ఆయనతో పాటుమాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సిద్ధంగా ఉన్నారు

Update: 2024-09-19 14:15 GMT

Balineni Effect: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. నిన్న మొన్నటి దాకా అధికార పీఠం అలంకరించి ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న వైఎస్ ఆర్సీలో అందరూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ పండితులు సైతం నిబిఢాశ్చర్యానికి గురయ్యేలా ఔరా అనిపించేలా హార్డ్ కోర్ వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. వైసీపీ అంటే తాను, తానే వైసీపీలా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన 24 గంటల్లోనే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంగళగిరిలో భేటీ అయ్యారు. ఈ భేటీ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

‘పోతో పోనీయండి..ఎంత కాలం బతిమలాడుతాం‘ అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నట్టు ప్రచారంలో ఉన్నా ఈ పరిణామంపై వైసీపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. బాలినేనే వెళ్ళిపోయిన తరువాత ఇంకెవరు మిగులుతారు..ఇక్కడసలు ఎంతమంది మిగులుతారన్నచర్చ మొదలైంది. జనసేన అధినేతతో భేటీ కావటానికి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ చర్చించుకుంటున్నాయి.

బాలినేనితో పాటు జనసేనలోలో చేరేందుకు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సిద్ధంగా ఉన్నారు. వీరంతా వైసీపీలో సీనియర్ నేతలే.. వీళ్లే కాకుండా మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా జనసేన తీర్థం తీసుకోబోతున్నట్టు సమాచారం. జగన్ హార్డ్ కోర్ టీంలో ఒకరిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ పేరు కూడా వినబడటం సంచలనం కలిగిస్తోంది.

జగన్ తో వైవీ భేటీ
మారుతున్న రాజకీయ పరిణామాలపై వైసీపీ అంతర్మధనం మొదలైంది.రోజులు గడిచే కొద్దీ ఇంకేం జరగబోతుందన్న సమాచారాన్ని రాబట్టే పనిలో పార్టీ అధినేత జగన్ ఉన్నట్టు సమాచారం. పవన్ తో బాలినేని భేటీ అవగానే రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన జగన్ తో భేటీ అయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. ఇంకెంతమంది ఉన్నారని జగన్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇపుడేం చేయాలి..నష్ట నివారణ చర్యలు ఏం చేపట్టాలన్న అంశంపై జగన్ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు సమాచారం. వైవీతో పాటు మరికొందరు సీనియర్ నాయకుల నుంచి కూడా జగన్ సమాచారం తెలుసుకుంటున్నారు..

జనసేనే ఎందుకు..!
అయిదేళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ సీనియర్ నేతలు .. ముఖ్యంగా ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీలో కంటే జనసేనలో చేరేందుకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు. వారెవ్వరితోనూ వీరికి సఖ్యత లేదు. 2019 నుంచి 2014 దాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రెండు పార్టీల నేతల మధ్య అగ్గి రాజేసుకుంది.

ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలానా నాయకుడిని చేర్చుకోవద్దనీ, అధికారంలో ఉండగా తమను ఇబ్బంది పెట్టారంటూ చంద్రబాబును కలిసి చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు జనసేన కంఫర్డ్ జోన్ గా ఉంటుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

జనసేనలో చేరటం ద్వారా నియోజకవర్గాల్లో అధికార దర్పాన్ని ప్రదర్శించలేకపోయినా కనీసం ప్రత్యర్ధుల కక్ష సాధింపు చర్యల నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. తాము అధికారంలో ఉండగా చేసిన అవినీతి కుంభకోణాలను తవ్వి తీసేందుకు కూటమి ప్రభుత్వం కనీసం వెనుకంజ వేసే అవకాశం ఉంటుందనీ, అయిదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ జోన్ లో ఉండవచ్చన్న భావన కూడా ఉంది. జనసేన కూడా నియోజకవర్గాల్లో బలమైన నాయకులను చేర్చుకోవటం ద్వారా భవిష్యత్ లో బలపడవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. అందువల్లనే బాలినేని వంటి వారిని చేర్చుకోవటం పట్ల ప్రకాశం జిల్లాలోని జనసేన నాయకుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా పవన్ పట్టించుకోవటం లేదని టాక్.

ఇటీవలనే ప్రకాశం జిల్లా జనసేన ఇన్ చార్జి రియాజ్ చంద్రబాబును కలిసి బాలినేని కుంభకోణాలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో..బాలినేనిని పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా గత కొంతకాలంగా కొనసాగుతున్న భారీ మంత్రాంగాల నేపథ్యలో బాలినేని జనసేనలో చేరుతున్నారు. త్వరలోనే చేరికకు ముహూర్తం ఖరారు కానుంది.

Tags:    

Similar News