Balineni Srinivas Reddy: జగన్ పార్టీలో ఎన్నో అవమానాలు.. కానీ పవన్ కల్యాణ్ విషయంలో అది బాగా నచ్చింది
Balineni Srinivas Reddy About Pawan Kalyan: వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అధినేత జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనను జగన్ మంత్రి పదవి నుండి తప్పించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ అప్పుడు జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం వల్ల మిమ్మల్ని కేబినెట్లో కొనసాగించలేకపోతున్నామని జగన్ చెప్పమన్నారు అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి స్వయంగా వచ్చి చెప్పారు. అంతేకాదు.. మీ జిల్లా నుండి ఎవ్వరికీ ఇవ్వడం లేదు.. అందుకే మీ జిల్లాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా మీరే చూసుకోవాలని జగన్ చెప్పారని సజ్జల తెలిపారు. కానీ తీరా చూస్తే.. సురేష్ వాళ్ల బావ తిప్పే స్వామికి మంత్రి పదవి ప్రకటించారు. ఆ తరువాత రెండు గంట్లలోనే మళ్లీ తిప్పే స్వామి పేరు తీసేసి సురేష్ పేరు ప్రకటించారు. అలా దాగుడుమూతలు ఆడటం ఎందుకు.. చెప్పాలనుకున్నదేదో నేరుగా చెప్పొచ్చు కదా అని వైఎస్సార్సీపీ అధిష్టానానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.
మాగుంట శ్రీనివాస్ రెడ్డి విషయంలో జరిగింది ఇదే..
మాగుంట శ్రీనివాస్ రెడ్డి మంచి మనిషి అనే ఉద్దేశంతో ఆయనకు ఎంపీ టికెట్ అడిగాను. కానీ కుదరదన్నారు. ఎక్కడో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇస్తామంటే మేం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ప్రజలు ఆదరించే వ్యక్తికే టికెట్ అడగడంలో తప్పులేదు కదా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
జగన్ ఏం మారలేదు.. అదే సమస్య
వైఎస్ జగన్ ఇప్పటికీ మారలేదు. ఇంకా అదే మైండ్‌సెట్‌తో ఉన్నారు. కార్యకర్తలను పట్టించుకోకుండా వ్యవహరిస్తే ఎలా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ మాట వింటూ ఆయన మరిన్ని చిక్కుల్లో పడుతున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
మంత్రి పదవి తీసేసిన తరువాత కూడా మరో అవమానం..
తనను మంత్రి పదవి నుండి తొలగించిన తరువాత కూడా పార్టీలో మళ్లీమళ్లీ తనను అవమానించారు అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. మంత్రి పదవి తీసేసిన తరువాత నాలుగు జిల్లాలకు కలిపి రీజినల్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చారు. ఆ తరువాత ప్రకాశం జిల్లా నుండి ఎవరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ వద్దకు వెళ్లి.. బాలినేని మా నియోజకవర్గాల్లో కలుగుజేసుకుంటున్నారని చెప్పగానే నా జిల్లాల జాబితాలోంచి ప్రకాశం జిల్లాను తొలగించి మిగతా మూడు జిల్లాలకే రీజినల్ కోఆర్డినేటర్ అన్నారు. వైఎస్సార్సీపీని స్థాపించినప్పటి నుండే పార్టీ కోసం పనిచేసిన నన్ను కాదని.. ఎవరో నిన్నగాకమొన్న మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు చెప్పింది నమ్మితే ఎలా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏం జరిగిందో కనీసం అడిగి తెలుసుకోకుండానే నాపై చర్యలు తీసుకోవడం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనను అవమానించడమే అవుతుందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
పవన్ కల్యాణ్ విషయంలో నాకు అది బాగా నచ్చిందన్న బాలినేని
పవన్ కల్యాణ్ తో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఆయనతో నాకు సంతృప్తినిచ్చిన సందర్భాలున్నాయి. అదేమంటే.. వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా సభలకు వచ్చి కూడా నా పేరెత్తని రోజులున్నాయి. కానీ పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాలో జరిగిన రెండుమూడు సభల్లో వైఎస్సార్సీపీ నేతలను విమర్శించినప్పటికీ.. నన్ను విమర్శంచలేదు. అంతేకాదు.. వైసీపీలోనూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి మంచి నాయకులున్నారు అని అన్నారు. పవన్ కల్యాణ్ నాపట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. నాకు అది చాలు అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాజాగా ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.