బలభద్రపురం... చిన్న ఊరు, వీధికొక క్యాన్సర్ పేషెంట్... క్యాన్సర్ భయంతో ఖాళీ అవుతున్న గ్రామం

Why cancer cases are rising in Balabhadrapuram: బలభద్రపురంలో దాదాపు వీధికొక క్యాన్సర్ పేషెంట్ ఉంటారని గ్రామస్తుల అంచనా.

Update: 2025-03-24 12:14 GMT

బలభద్రపురం... చిన్న ఊరు, వీధికొక క్యాన్సర్ పేషెంట్... క్యాన్సర్ మిస్టరీ భయంతో ఖాళీ అవుతున్న ఊరి కథ

Balabhadrapuram, a village linked to rising cancer cases: బలభద్రపురం... ఇప్పుడు ఈ ఊరు క్యాన్సర్ పరిశోధకులకు ఒక మిస్టరీగా మారిపోయింది. రాజమండ్రికి సమీపంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో బలభద్రపురం అనే గ్రామం పేరు వింటేనే అక్కడి స్థానికులు వణికిపోతున్నారు. ఆ చుట్టుపక్కల గ్రామాల వారు ఆ ఊరి వైపు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఆ ఊర్లో ఉన్న వారితో వియ్యం అందుకోవాలంటే అస్సలే ముందుకు రావడం లేదు. దీంతో ఆ గ్రామస్తులు కూడా ఊరు వదిలి సమీపంలోని పట్టణాలు, పల్లెలకు వెళ్లిపోతున్నారు.

వ్యవసాయం, బతుకుదెరువు, ఆ ఊరితో విడదీయలేని అనుబంధం ఉన్న వారు మాత్రం ఊరిని వదల్లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీనికంతటికీ కారణం ఆ ఊర్లో వీధికొక క్యాన్సర్ పేషెంట్ ఉండటమే. అంతేకాదు... కాలం గడుస్తున్న కొద్దీ క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ప్రస్తుతం బలభద్రపురం సమస్య తీవ్రత గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, కొంతమంది క్యాన్సర్‌తో బాధపడుతున్నా ఆ విషయం బయటికి తెలిస్తే సమాజం తమను చిన్నచూపు చూస్తుందేమోననే భయంతో బయటికి చెప్పడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

పచ్చని పంట పొలాల మధ్య ఉన్న బలభద్రపురంలో దాదాపు వీధికొక క్యాన్సర్ పేషెంట్ ఉంటారని గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. ఊరు మొత్తం 200 క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారని ఒక అంచనా. ఈ క్యాన్సర్ భయంతో యువత ఊరు విడిచిపెడుతోంది. దీంతో ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. ఖాళీ అయిన ఇళ్లను కొనే వారు లేరు. వ్యవసాయ భూముల విలువ కూడా 40 శాతం పడిపోయిందని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చెబుతున్నారు. అయినా కూడా ఎవ్వరూ కొనడానికి ముందుకు రావడం లేదంటున్నారు.

బలభద్రపురం వార్తల్లోకెక్కడంతో ప్రభుత్వం అక్కడ హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వారికి వైద్య సహాయం అందిస్తోంది. ఊరిలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటని సంబంధిత అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

ఒక వృద్ధురాలికి క్యాన్సర్‌తో భర్త మరణించారు. ఆమె కూడా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధాప్యంలో ఏ తోడు లేకుండానే పేదరికంలో ఆమె క్యాన్సర్‌తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో క్యాన్సర్‌తో బాధపడుతూ పెద్దలు చనిపోతే పిల్లలు ఒంటరి వారయ్యారు.

ఓ ఇంట్లో క్యాన్సర్‌తో పోరాడుతున్న కొడుక్కు సేవలు చేస్తోన్న తల్లి... మరో ఇంట్లో తల్లికి సేవలు చేస్తోన్న పిల్లలు. సమాజం ఎక్కడ దూరం పెడుతుందోననే భయంతో చెప్పుకోవడానికి ఇష్టపడుతున్న కుటుంబాలు కొన్ని. గ్రామస్తులను అలా చూసి భయపడుతున్న కుటుంబాలు ఇంకొన్ని. ఇలా ఏ ఇంటి తలుపు తట్టినా ఏదో ఒక కన్నీటి క్యాన్సర్ గాథే కనిపిస్తోంది. ఖరీదైన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి ఆర్థికంగా చితికిపోతున్నారు.

అందుకే ఆ ఊరిలో గ్రామస్తులకు వైద్య సహాయంతో పాటు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. బలభద్రపురంలో నేల, నీరు, గాలి... ఇలా అన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. ఊరి వాతావరణంలోనే ఏమైనా క్యాన్సర్ కారకాలు ఉన్నాయా అనే కోణంలో అధ్యయనం చేస్తున్నారు.

సమాజానికి భయపడి బయటికి రానివారికి కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యం చేస్తున్నారు. క్యాన్సర్ ఎంత త్వరగా కనుక్కుంటే చికిత్స అంత తేలిక అవుతుందని, లేదంటే క్యాన్సర్‌ను గుర్తించడంలో ఎంత ఆలస్యమైతే చికిత్స కూడా అంతే జఠిలం అవుతుందని వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు. బలభద్రపురం భూగర్భ జలంలోనే సమస్య ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శాస్త్రీయంగా ఏదీ తేలనంత వరకు అది ఒక అనుమానం మాత్రమే. అసలు నిగ్గు తేలనంతవరకు అది ఒక మిస్టరీనే.

Also Read : మరిన్ని వార్తా కథనాలు

Tags:    

Similar News