ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
Atmakuru By Election: ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు
Atmakuru By Election: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం ఇవాళ వెలువడనుంది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కొ టేబుల్‌లో 20 నిమిషాల్లో పూర్తి ఫలితం రానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉంటేనే ఏజెంట్లు, అభ్యర్థులు కౌంటింగ్ హాలు కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైసీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దాదాపు 2 లక్షల 13వేల 338 మంది ఓటర్లు ఉండగా.. ఈ ఉప ఎన్నికల్లో లక్షా 36వేల 905 మంది తమ ఓట హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 64.17 శాతం పోలింగ్ జరిగింది. ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం మండలాల్లో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.