AP Three Capital Issue: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ముచ్చట్లు!

Update: 2020-08-05 09:14 GMT

AP Three Capital Issue: మూడు రాజధానులపై ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. ఏపీలో సీఆర్డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదముద్రవేశారు. ప్రభుత్వం కూడా స్పీడు పెంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఈ మూడు రాజధానులకు బీజం ఎప్పుడు పడింది..? నవ్యాంధ్రప్రదేశ్ తొలిరాజధానిగా ప్రస్థానం ప్రారంభించిన అమరావతి భవిష్యత్తేమిటి..? ప్రభుత్వం చెబుతున్నట్లు మూడు ప్రాంతాల్లో ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందా...? అసలు ఏపీలో ఏం జరగబోతోంది...? ఈ అంశంపై హెచ్ ఎంటి వి గ్రౌండ్ రిపోర్ట్.

2014 జూన్‌ 2వ తేదీ నుంచి ఏపీ విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇక నవ్యాంధ్ర రాజధాని ఎక్కడ ఉండబోతుందన్న చర్చ సర్వత్రా వినిపించింది. అయితే భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో ఉంది కాబట్టి రాజధానిగా అమరావతే బెస్టని నాటి టీడీపీ ప్రభుత్వం తేల్చేసింది. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా అమరావతిని రాజధానిగా 2014 సెప్టెంబరు 3 వ తేదీన అసెంబ్లీ తీర్మానంతో ఆమోదింప చేసింది. సుమారు 8352 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తిస్తూ నోటిఫై ప్రభుత్వం సంతకం చేసింది. అదే ఏడాది అక్టోబరు 25న లాండ్ పూలింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే లాండ్ పూలింగ్ కూడా అంత సాఫీగా సాగలేదు ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రక్రియకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కొన్ని సమస్యలుతో నాటి చంద్రబాబు లాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను మెజార్టీ శాతం పూర్తి చేసింది.

ఇక దాదాపు 20,510 మంది రైతుల నుండి సుమారు 32,469 ఎకరాలను సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన పర్యవేక్షణ కోసం, రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీలకు అనుగుణంగా సీఆర్డీఏ చట్టాన్ని తయారు చేసింది. రాజధానికి అవసరమైన లాండ్ బ్యాంక్ ను సంపాదించటంతో టీడీపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. ఇక తర్వాత పరిపాలనకు అవసరమైన భవనాల నిర్మాణంపై దృష్టిసారించింది. వెలగపూడిలో సచివాలయాన్ని, అసెంబ్లీ భవనాలను నిర్మించింది. మిగిలిన విభాగాలకు గుంటూరు, విజయవాడల్లో అందుబాటులో ఉన్న భవనాలను అద్దెకు తీసుకుంది. అయితే అద్దెకు తీసుకున్న భవనాలు టీడీపీ నేతలకు చెందినవేన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజధాని మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం సిద్ధం చేయడంతో 2015 అక్టోబర్ 22 వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉద్ధండరాయునిపాలెంలో అత్యంత వైభవంగా రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

2016 నాటికి టీడీపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో సచివాలయ భవనాలను పూర్తి చేసుకుంది. అయితే ఇవన్నీ తాత్కాలిక భవనాలని చెప్పడం అమరావతి భవిష్యత్తుకు ప్రమాదఘంటికలని నాటి చంద్రబాబు సర్కార్ గుర్తించలేకపోయింది. ఇక రాజధాని అమరావతి బ్రాండింగ్ పెంచే పనిలో పడ్డారు చంద్రబాబు. పలు దేశాల ప్రతినిధులతో సమావేశాలు జరిపారు. పలు ఒప్పందాలు చేసుకున్నారు. అదిరిపోయే డిజైన్లను చూపిస్తూ ప్రపంచస్థాయి రాజధానిగా మారుస్తామని భూములిచ్చిన రైతుల్లో ధైర్యాన్ని, పెట్టుబడులు పెట్టేవారిలో ఆసక్తినీ నింపే ప్రయత్నం చేశారు. 2019 ఫిబ్రవరి 3న హైకోర్టు శాశ్వత భవనానికి నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన గొగోయ్ చేత చంద్రబాబు శంకుస్థాపన చేయించారు.

సరిగ్గా రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటాయని భావిస్తోన్న నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించింది. దీంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌ చంద్రబాబు మార్క్ కానీ, టీడీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాల ప్రభావం కానీ తన ప్రభుత్వంపై పడకూడదని భావించారు. రాజధానిలో అప్పటివరకూ చేపట్టిన పనుల్ని ఆపేశారు. పలు టెండర్లు రద్దు చేశారు. చివరగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి రాజధాని రైతుల్నే కాదు, విపక్షాలకు కూడా జగన్‌ గట్టి షాకే ఇచ్చారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో మూడు రాజధానులను ప్రకటించి కొత్త అధ్యాయానికి తెరతీశారు.

ఇక ఆ తర్వాత నుండి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు అసెంబ్లీ ముట్టడులు జరిగాయి. అయినప్పటికీ తన నిర్ణయంపై ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించని జగన్ మూడు రాజధానులపై జీఎన్ రావు, బీసీజీ వంటి కమిటీలను ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత మళ్లీ 2020 జనవరి 20 వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ, ఏపీ సీఆర్డే ఏ చట్టాలకు సభ ఆమోదం తెలిపింది. మూడు ప్రాంతాలకు న్యాయం జరగాలంటే మూడు రాజధానులు ఉండాల్సిందేనని వాదిస్తూ వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా, కర్నూలు ను న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేస్తూ ఏపీ ప్రభుత్వం చేసిన బిల్లులను జూన్ 16న మరోసారి శాసనసభ ఆమోదించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు పంపించారు. గవర్నర్‌ అన్నిరకాలుగా పరిశీలించి, న్యాయపరంగా అంతా ఓకే అన్న తర్వాత జూలై 31 న ఆమోదముద్ర వేశారు.

కర్నూలుకు రాజధాని హోదా వస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు న్యాయరాజధాని కావటం వల్ల మొత్తం రాయలసీమకు మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇక పరిపాలన రాజధానిగా మారనున్న వైజాగ్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలే కొత్త జిల్లాల ఏర్పాటు తో తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందా అన్న భయంలో ఉన్న అన్ని పార్టీల నేతలు తాజా పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నారు. నవ్యాంధ్ర తొలిరాజధానిగా ప్రకటించడంతో అమరావతి ఆరేళ్లలోనే తన ప్రాధాన్యత కోల్పోయినట్లయింది. చట్ట సభల్లోనూ, రాజ్యాంగ వ్యవస్థల్లోనూ ఆమోద ముద్ర వేసుకుంది కాబట్టి ఇక మూడు రాజధానులకు తిరుగేలేదని అధికార వైసీపీ ధీమాగా త్రీ కేపిటల్ పనులకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మూడు రాజధానుల నిర్ణయమే పూర్తిగా అమలైతే ప్రస్తుతం అమరావతిలో జరిగిన పదివేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఏమవుతాయి...? ఆ భవనాలను ఏం చేస్తారు..? సీఎం జగన్‌ రైతులకు ఏవిధమైన భరోసా ఇవ్వబోతున్నారో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News