ఏపీలో కాకరేపుతున్న పంచాయితీ పోరు.. ప్రభుత్వ సలహాదారు సజ్జలను తొలగించాలని గవర్నర్‌కు లేఖ
*సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు నిమ్మగడ్డ వరుస లేఖలు *ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం అన్న విధంగా మారిన పరిస్థితి *వరుస లేఖలతో దూకుడు పెంచిన నిమ్మగడ్డ
ఏపీలో పంచాయితీ పోరు కాకరేపుతోంది. ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం అన్న విధంగా పరిస్థితి మారిపోయింది. సుప్రీం తీర్పుతో దూకుడు పెంచిన ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలకు సహకరించని అధికారులపై వరుసగా వేటు వేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ నిమ్మగడ్డ మరింత దూకుడు పెంచారు. ఏకంగా ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు లేఖ రాశారు. బొత్స, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగిస్తోంది.
ఏపీలో ఎస్ఈసీ వరుస లేఖలు మంటలు పుట్టిస్తున్నాయి. ఎన్నికల విషయంలో తనపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారంటూ నిమ్మగడ్డ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు వరుస లేఖలు రాశారు. జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఎన్నికల విధుల్లో ప్రవీణ్ ప్రకాష్ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరింది. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశాలని ఇవ్వాలని లేఖలో పేర్కొంది.
మరోవైపు అధికార వైసీపీ కీలక నేతలపై నిమ్మగడ్డ ఫైర్ అయ్యారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసిన నిమ్మగడ్డ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని తెలిపారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు నిమ్మగడ్డ. వ్యక్తిగత విమర్శలకు పాల్పడకుండా మంత్రులకు సూచించాలని గవర్నర్ ను కోరారు ఎస్‌ఈసీ.
ఇక నిమ్మగడ్డ లేఖల వ్యవహారంపై విజయసాయిరెడ్డి, సజ్జల మండి పడ్డారు. నిమ్మగడ్డ ధోరణి మొదటి నుంచి సరిగాలేదని ముందే చెప్పామని.. నిమ్మగడ్డ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారంటూ విజయసాయి ఫైర్ ఐతే నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.