పంచాయతీ సమరంలో అసలుసిసలు రణం రాజుకుటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు దక్కించుకునేందుకు, పైచేయి సాధించేందుకు ఒకరకమైన యుద్ధమే జరుగుతోంది. యుక్తులు, కుయుక్తులకు శ్రీకారం చుడుతున్న నేతలు విజయం తమకే దక్కాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పరువు-ప్రతిష్టలకు మారుపేరుగా జరుగుతున్న పంచాయతీ పోరులో.. గెలుపు కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్న వేళ... రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ మెలికలు పెట్టడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. 13 జిల్లాల్లో ఏకగ్రీవాల లెక్కలు అలా సాగుతుంటే... గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ఏకగ్రీవాలే ఎందుకు తెరమీదికి వచ్చాయి.? ఇదే ఇప్పుడు జరుగుతున్న చర్చ.
ప్రతిష్టాత్మకంగా మారిన పంచాయతీ ఎన్నికలు..ఇజ్జత్ కీ సవాల్ అంటున్న స్థానిక నాయకులు..జిల్లాల్లో కొనసాగుతున్న ఏకగ్రీవాలు.. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ప్రతిష్టంభన..ఆ రెండు జిల్లాపై నిర్ణయం ఇప్పుడే వద్దంటున్న నిమ్మగడ్డ..ఆ రెండు జిల్లాలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి?. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తీరు, నేతలు అనుసరిస్తున్న విధానాలు, నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. పల్లెల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ.. ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంటే... చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ ఎస్‌ఈసీ ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఎన్నికలు, బదిలీల రచ్చ అయిపోతుందనుకుంటున్న టైమ్‌లో ఏకగ్రీవాలతో మరోసారి రాజకీయ రణరంగం మొదలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏకగ్రీవాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ప్రతిపక్షం మండిపడుతుండటంతో పాటు... కొందరు బెదిరించి, భయపెట్టి, ఒత్తిడి చేసి ఏకగ్రీవం చేస్తున్నారన్న సాకుతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలకు బ్రేకులు వేశారన్న ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలను హోల్డ్‌లో ఉంచాలన్నది ఎస్‌ఈసీ ఆదేశం. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని నిమ్మగడ్డ ఆదేశించారు. అలాగే ఈ గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి నివేదిక పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. లోపాలు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, ఈ రెండు జిల్లాల్లో భారీగా బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని గుర్తించడం వల్లే ఎస్‌ఈసీ నిలిపివేశారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇది ప్రజాస్వామ్య విరుద్దమని ప్రభుత్వం చెబుతోంది.
చిత్తూరు, గుంటూరు జిల్లాలో అయితే దాదాపు 50 శాతం ఏకగ్రీవాలు జరిగాయి. కొన్ని జిల్లాల్లో 10 శాతానికి లోపే ఏకగ్రీవాలు జరిగాయి. నిజానికి, పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలనేది సర్వసాధారణమైన విషయం. అధికారం ఎవరి చేతిలో వుంటే, వారికి అనుకూలంగా ఏకగ్రీవాలు జరుగుతుంటాయి. ఈసారి రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకోవాలని అధికార వైసీపీ అడ్డగోలు ప్రయత్నాలన్నీ చేసిందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. సాధారణ ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూ, బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదన్న నిమ్మగడ్డ అల్టిమేటం జారీ చేసినా... ఏకగ్రీవాలు ఆగలేదు.
పంచాయతీ పోరు... అసెంబ్లీ రణరంగం కంటే ఎక్కువగా సాగుతోంది ఏపీలో. ఎందుకంటే ఇటు ప్రభుత్వం... అటు కమిషన్... ఎదురొడ్డి... నువ్వా-నేనా అన్నంతగా సంకుల సమరాన్ని సాగిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ తాజాగా దృష్టి పెట్టింది. బలవంతపు ఏకగ్రీవాలను, భయపెట్టి ఒత్తిడి పెంచుతన్న వ్యూహాలను సహించబోమంటోంది. అసలు ఇప్పటి వరకు ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి? అసలు ఏకగ్రీవాలపై చట్టం ఏం చెబుతోంది.? చూద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు 517 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరులో 110, గుంటూరులో 67 పంచాయితీలు ఏకగ్రీవాలైన పల్లెల్లో పంచాయతీ సమరం పట్టు తప్పిందన్న సమాచారం తమ వద్ద ఉందన్నది ఎస్‌ఈసీ చెబుతున్న మాట. ఇక 13 జిల్లాల్లో ఏకగ్రీవాలను పరిశీలిస్తే... చిత్తూరు జిల్లాలో ఇందాక చెప్పుకున్నట్టు మొత్తం 110 ఏకగ్రీవాలు కాగా... అందులో వైసీపీ 95, టీడీపీ 9, స్వతంత్రులు ఆరుగురిని ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. ఇక గుంటూరులో కూడా మొత్తం 67 పంచాయితీ ఏకగ్రీవమవగా.. అందులో 63 వైసీపీ, 2 టీడీపీ, 2 స్వతంత్రుల ఖాతాలో పడ్డాయి. తాజాగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఏకగ్రీవాలు భారీగా నమోదు కావడంతో పెండింగులో పెట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మిగిలిన... కర్నూలు జిల్లాలో 54, కడపలో 46, శ్రీకాకుళం జిల్లా 34, పశ్చిమగోదావరిలో 40, విశాఖ జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 16, కృష్ణాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 28 ఏకగ్రీవం అయ్యాయి.
అసలు ఏకగ్రీవాలపై చట్టం ఏం చెబుతుందో చూద్దాం. వాస్తవానికి ఏకగ్రీవాలు ఇష్ట పూర్వకంగా జరగాలి. బలవంతంగా జరపడం చట్టవ్యతిరేకమైన చర్య అవుతుంది. కిందటేడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ , పంచాయతీలకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. పంచాయతీలకు మినహా మిగిలిన అన్నింటికి నోటిఫికేషన్ వెలువడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లు కూడా పూర్తి కావడంతో చాలా చోట్ల ఏకగ్రీవాలే అయ్యాయి. అయితే చట్టం ప్రకారం అభ్యంతరాలు ఉంటే సంబంధించిన వ్యక్తులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదులు పరిశీలించిన కమిషన్ రద్దు చేయడం లేదా తిరస్కరించడం చేయాలి. అందుకు భిన్నంగా ఏకగ్రీవాలకు అప్పట్లో డిక్లరేషన్ ఇచ్చారు అధికారులు. ఒకవేళ స్థానిక అధికారులు తప్పు చేసి ఉంటే డిక్లరేషన్ ఇచ్చే ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసి ఉండాలి. కానీ అలాంటి ప్రయత్నమేమీ చేయకుండా ఎన్నికలను వాయిదా వేసింది ఎస్‌ఈసీ.
ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. ఎక్కడ ప్రక్రియ నిలిచిపోయిందో తిరిగి అక్కడి నుంచి మొదలవుతుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. చట్ట ప్రకారం ఒకసారి కమిషన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికపై అభ్యంతరాలు ఉంటే... పోటీదారులు కోర్టును ఆశ్రయించడం మినహా మరో గత్యంతరం లేదు. మరి
కమిషన్ మీద అనుమానం ఎందుకంటే... తన చేతిలో అధికారం ఉన్నప్పుడు చర్యలు తీసుకోకుండా డిక్లరేషన్ ఇచ్చి తర్వాత కేంద్ర హోంశాఖకి కమిషనర్ నిమ్మగడ్డ లేఖ రాయడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. నిజానికి ఈ వివాదం కేంద్ర హోంశాఖ కార్యదర్శి పరిధిలోకి రాదు. తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన కమిషన్ అప్పట్లో... చెప్పినట్లు ఎక్కడ ప్రక్రియ ఆగిందో అక్కడ నుంచి మొదలెట్టకుండా... నోటిఫికేషన్ విడుదల చేయని పంచాయతీ ఎన్నికల నిర్వహించడాన్ని ప్రభుత్వం సమర్థించడం లేదు. ఇక్కడే ఏకగ్రీవాల విషయం వివాదాస్పదమవుతోందన్నది పరిశీలకుల మాట.