AP Municipal Elections Results: మున్సిపోల్స్‌లో వైసీపీ సునామీ
AP Municipal Elections Results:మున్సిపోల్స్‌లో వైసీపీ సునామీ సృష్టించింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైఎస్సార్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
AP Municipal Elections Results: మున్సిపోల్స్‌లో వైసీపీ సునామీ సృష్టించింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైఎస్సార్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏపీ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా వైసీపీ రికార్డు విక్టరీ కొట్టింది. దాదాపు వంద శాతం విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. సునామీలా విరుచుపడ్డ ఫ్యాన్ హోరు గాలికి విపక్షాలు కొట్టుకుపోయాయి.
అలా ఇలా లేదు. అక్కడా ఇక్కడా తేడా లేదు. ఎదురొచ్చిన పార్టీని నేలకేసి కొట్టింది. ఎక్కడైనా తమకు ఎదురేలేదని ఫ్యాన్ పార్టీ పాంచ్ నెంబర్ మీద జోరుగా తిరిగింది. ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తూ... తమను ఢీకొట్టే పార్టీయే లేదని చాటి చెప్పింది. నగరపాలికలు, పురపాలికలు అన్న తేడా లేకుండా... ఫ్యాన్ పార్టీ సత్తా చాటింది. 20 నెలల వైఎస్ జగన్ పాలనకు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు ఆంధ్ర ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టం కట్టారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకూ వైసీపీ ప్రభంజనం కొనసాగింది. ఫ్యాన్ గాలికి టీడీపీ, జనసేనతోపాటు ఇతర విపక్షాలు కకావికలై పోయాయి. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలోనూ సగానికి పైగా స్ధానాలను కైవసం చేసుకుంది. ఎక్కడ చూసినా వైసీపీతో పోలిస్తే రెండో స్ధానంలో నిలిచిన టీడీపీ చాలా దూరంలోనే నిలిచిపోయింది. ఓట్ల పరంగా, సీట్ల పరంగా వైసీపీ సాధించిన మున్సిపల్ విజయం అసెంబ్లీ ఎన్నికలను సైతం మించిపోయింది.
మొత్తం 12 కార్పోరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏలూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగినా హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ చేపట్టలేదు. ఇక, పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్లలో ఏకగ్రీవాలు కావడంతో మిగిలిన 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైసీపీ భారీ విజయాల్ని నమోదు చేసింది. దాంతో, రాష్ట్ర చరిత్రలోనే ఈ ఎన్నికలు ఓ రికార్డుగా నిలవబోతున్నాయి.
వైసీపీ హోరు గాలికి విపక్షాలన్నీ కొట్టుకుపోయాయి. అయితే ప్రధాన విపక్షం టీడీపీతో పోలిస్తే జనసేన మెరుగైన ప్రదర్శన చూపింది. పలుచోట్ల వైసీపీ, టీడీపీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా ఓట్లు కూడా చీల్చుకుంది. మరికొన్ని చోట్ల టీడీపీకి మద్దతిచ్చింది. ఇంకొన్ని చోట్ల టీడీపీ మద్దతు తీసుకుని గెల్చుకుంది. అమలాపురం మున్సిపాల్టీలో అయితే ఏకంగా టీడీపీని మూడో స్ధానానికి నెట్టి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఏపీ మున్సిపోల్స్‌లో ప్రతిపక్ష టీడీపీ అడ్రస్ గల్లంతైంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం సైకిల్ పార్టీకి పంక్చర్లు పడ్డాయి. భూతద్ధంలో వెదికినా టీడీపీ తరపున గెలిచిన అభ్యర్ధులు కనిపించని పరిస్థితి ఏర్పడింది.
కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా, చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా... అనంతపురం జిల్లా తాడిపత్రిలో చంద్రబాబు పార్టీ ఆధిక్యాన్ని చూపించింది. తాడిపత్రిని తాడేసి చుట్టేసింది. తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ పై టీడీపీ జెండా ఎగురవేసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో అయితే ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. గుంటూరు, విజయవాడలో పెట్టుకున్న ఆశలు కూడా గల్లంతయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మున్సిపల్ పోరులో రాష్ట్రమంతా టీడీపీకి ఎదురుగాలి వీచినా కేవలం తాడిపత్రిలో మాత్రం ఊరట లభించింది.
కడప జిల్లా మైదుకూరులో టీడీపీ, వైసీపీ మధ్య ఒకే ఒక్క సీటు తేడా. ఇక్కడ ఒక్క సీటు ఆధిక్యం అందుకున్న టీడీపీకి ఎక్స్ అఫీషియో ఓట్ల రూపంలో వైసీపీ నుంచి గండం పొంచి ఉంది. అయితే వాటితో కూడా అవసరం లేకుండా క్యాంప్ రాజకీయాలకు పార్టీలు తెరలేపాయి. ఇక మిగిలిన తాడిపత్రిలోనూ టీడీపీ కార్పోరేటర్లపై వైసీపీ వల విసురుతోంది. ఛైర్మన్ ఎన్నికలు జరిగే లోపు ఇక్కడ టీడీపీ కార్పోరేటర్లు వైసీపీ వైపు మొగ్గితే ఇక మున్సిపల్ పోరులో టీడీపీకి మిగిలేది సున్నాయే.
కేవలం అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రమే టీడీపీకి ఊరట లభించింది. మిగతా 74 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 11 కార్పోరేషన్లలో వైసీపీ సునామీ కొనసాగింది. విజయవాడ, విశాఖ, మచిలీపట్నం కార్పోరేషన్లలో తుది ఫలితాలు వెలువడాల్సి ఉన్నా ప్రస్తుత ఆధిక్యాలను చూసుకుంటే వైసీపీ మ్యాజిక్ మార్క్ దాటిపోయింది. దీంతో మున్సిపల్ ఎన్నికల పోరును వైసీపీ ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో ముగించినట్లయింది. చివరికి టీడీపీ ఆశలు పెట్టుకున్న అమరావతి ప్రాంతంలోనూ విజయవాడ, గుంటూరు కార్పోరేషన్లలోనూ ఓటమి తప్పలేదు.
71 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో హస్తం పార్టీ ఊసే లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు అయినా దక్కాయో లేదు. రాష్ట్ర విభజన దెబ్బకు పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ... స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగైంది. ఇప్పట్లో కాంగ్రెస్ తెరపైకి రావడం, తెగించి కొట్లాడటం అంత ఈజీగా కనిపించడం లేదు.
ఇక మరో రెండు సంయుక్త పార్టీలు బీజేపీ, జనసేన. చూడ్డానికి, పైకి చెప్పడానికి రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నా... అలా నటిస్తున్నా... కమలం అంతగా వికసించలేదు. గాజు గ్లాసు తునాతునకలైపోయింది. ఎక్కడా కూడా రెండు పార్టీలు తమ ప్రాభవాన్ని చూపించలేకపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా సత్తా చాటలేకపోయాయి. ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. అసెంబ్లీలో కంటే కూడా ఘోరమైన పరాభవం ప్రత్యర్థి పార్టీలకు ఎదురైంది. రకరకాల ఊహాగానాలు, ఎన్నో రకాల వివాదాస్పద వ్యాఖ్యల నడుమ సాగిన నగరపాలిక, పురపాలిక సంఘాల ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించింది. తిరుగులేని విధంగా, తమకు ఎదురులేని విధంగా సరికొత్త చరిత్రను రాసిపెట్టింది. ఇంతవరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా... ఇంతటి మెజారిటీ రాలేదంటున్నారు విశ్లేషకులు.