ఏపీలో మలుపులు తిరుగుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం
*ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తొలగింపు వ్యవహారంపై ఎస్‌ఈసీ సీరియస్ *తన ఆదేశాలు అమలు కాకపోవడంతో నిమ్మగడ్డ ఆగ్రహం *ఇది చట్ట విరుద్ధం.. కోర్టు ధిక్కరణే.. తీవ్ర పరిణామాలు తప్పవన్న SEC
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికార ప్రభుత్వం వైసీపీ, ఎస్‌ఈసీకి మధ్య పంచాయితీ తెగడం లేదు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని లెక్కచేయటం లేదని వైసీపీ అంటుంటే ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవట్లేదని నిమ్మగడ్డ ఫైర్ అవుతున్నారు. దీంతో రోజురోజుకు ఏపీలో పంచాయతీ ఎన్నికల హీట్ పెరుగుతుంది.
ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై వైసీపీ సర్కార్ మరో ఎటాక్‌కు దిగింది. ఎన్నికల కమిషనర్‌పై ప్రభుత్వం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. నిమ్మగడ్డ తీరుపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శాసన సభ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారని.., ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
అటు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ తొలగింపు వ్యవహారంపై ఎస్‌ఈసీ సీరియస్ అయ్యారు. ప్రవీణ్ ప్రకాశ్‌ను తొలగించాలని తాను చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంతో ఎస్‌ఈసీ తీవ్రంగా స్పందించారు. తన ఆదేశాలు అమలు చేయకపోవడం చట్ట విరుద్ధమన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.., ఇకపై తన ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అటు ఆదేశాలు అమలు కాకపోతే కోర్టు ధిక్కరణ అవుతుందని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే త్వరలోనే ప్రివిలేజ్ కమిటీ భేటీ తేదీ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. భేటీ తర్వాత మంత్రుల నోటీసులపై వివరణ కోరుతూ ఎస్‌ఈసీకి నోటీసులు పంపించనుంది ప్రివిలేజ్ కమిటీ.