ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. నిమ్మగడ్డ తొలగింపు కోసం తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేసింది. దీనిపై సుదీర్ఘంగా వాదనలు విన్న కోర్టు నిమ్మగడ్డను అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టయింది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ పదవీకాలాన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. అంతేకాదు నూతన ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ప్రభుత్వ పరిధిలో తమకున్న విశాక్షాణాధికారంతో చేశామని చెప్పుకొచ్చింది. అయితే దీనిపై రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇప్పటికే పలు దఫాలు వాదనలు విన్నది.
పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఆదినారాయణ, వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ మేరకు కోర్టు ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ వ్యవహార శైలి సరిగా లేదని.. తమకున్న అధికారాలతోనే ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదించామని కోర్టులో వాదించింది. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డనే కోనసాగించాలని స్పష్టం చేసింది.