వరద బాధితులకు జగన్ సర్కార్ తక్షణ సాయం విడుదల.. ఎంతో తెలుసా?
ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం విడుదల చేసింది. భారీవర్షాలు, కృష్ణా, గోదావరి నదుల వరద ముంపు బారిన పడిన ఒక్కో బాధిత కుటుంబానికి..
ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం విడుదల చేసింది. భారీవర్షాలు, కృష్ణా, గోదావరి నదుల వరద ముంపు బారిన పడిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.500చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. దీంతో వరద ప్రభావానికి గురైన విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన బాధితులకు ఈ సాయం అందనుంది. వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం చేయాలనీ ఆయా జిల్లాల అధికారుల్ని ఆదేశించారు. అలాగే పంట నష్టంపై అంచనా వేయాలని.. నేలకూలిన ఇళ్లను తిరిగి నిర్మించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉంటే వరదల వల్ల రాష్ట్రంలో 1,07,859 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47,745 హెక్టార్లలో పంట నష్టం జరిగింది.