Visakhapatnam: విశాఖ నుంచి రాష్ట్ర వ్యవహారాలు చూసేందుకు అడుగులు

Visakhapatnam: రెండు, మూడు నెలల్లోనే విశాఖ నుంచి పాలనకు ఛాన్స్‌

Update: 2021-06-17 07:12 GMT

విశాఖపట్నం (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖ పరిపాలన రాజధానిగా అవతరించబోతోందా అంటే దానికి అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉక్కు నగరాన్ని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేసుకుని, అక్కడి నుంచే రాష్ట్ర వ్యవహారాలు చూసేందుకు అడుగులు పడుతున్నాయి. మరోపక్క సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖ వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకో రెండు, మూడు నెలల్లోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం కావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

పర్యటనలపై ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖుల కోసం ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక రహదారిని కేటాయించాలని భావిస్తున్నారు. విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ మీదుగా వెళ్లేలా 35 కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేశారు. ఈ మార్గంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇదివరకే జీవీఎంసీ పరిధిలో వివిధ రకాల పనులు చేసిన గుత్తేదారులకు 350 కోట్ల మేర బకాయిలున్నాయి. వీటిని త్వరగా చెల్లించి మౌలికవసతుల పనులకు సహకరించాలని వారిని కోరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక.. బోయపాలెం వద్ద ఒక విద్యాసంస్థలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో చర్చలు సాగుతున్నాయి.

విశాఖ నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రాకపోకలు ఉండాలని భావిస్తున్నారు అధికారులు. ప్రతిపాదిత మార్గంలో ప్రస్తుతం ఎన్‌ఏడీ కూడలిలో పైవంతెన పూర్తయింది. ఎన్‌ఏడీ నుంచి హనుమంతవాక వరకు బీఆర్‌టీఎస్‌ ఉంది. ఇందులో భాగంగా సింహాచలం గోశాల కూడలి నుంచి అడవివరం కూడలి వరకు 2 కిలోమీటర్ల రహదారి విస్తరణ విషయమై 2007 నుంచి వివాదం నడుస్తోంది. న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు సాగలేదు. దీంతో.. చట్టపరంగా ఓ పరిష్కారానికి రావాలని చూస్తున్నారు. అక్కడి గృహాలకు టీడీఆర్‌ లేదా భూములు ఇవ్వడమా అన్నది యోచిస్తున్నారు. వివాదాస్పద 2 కిలోమీటర్ల బీఆర్‌టీఎస్‌ రోడ్డుతో కలిపి గోపాలపట్నంలోని సింహాచలం ఆర్చి నుంచి అడవివరం కూడలి వరకు 6 కిలోమీటర్ల మేర మౌలిక వసతుల కల్పనకు యోచిస్తున్నారు. ఇందుకోసం.. 100 కోట్లకు పైనే ప్రతిపాదించనున్నారు. త్వరలో టెండర్లకు వెళ్లే ఆలోచన ఉంది.

ఇటీవల ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది నగరానికి వచ్చి విమానాశ్రయం, సచివాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల మధ్య మార్గాన్ని పరిశీలించారు. మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా కొన్ని మార్పులు చేయాలని సూచించారు. వీరి సూచనలకు అనుగుణంగా జీవీఎంసీ కార్యాచరణ రూపొందిస్తోంది. విశాఖకు వచ్చాక సీఎం నివాసం ఎక్కడుంటుందనే విషయమై గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బీచ్‌రోడ్డులోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో స్మార్ట్‌ సిటీలో భాగంగా పూర్తయిన కొన్ని కీలక కట్టడాలు ఉన్నాయి. వీటితో పాటు ఓ ఫంక్షన్‌ హాలు, ఓ అతిథి గృహాన్ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగించనున్నారని మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారు. ఒకసారి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాక విశాఖ పారిపాలన రాజధాని కావడం తధ్యమని స్పష్టం చేస్తున్నారు. విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమైతే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News