ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. తిరుమలలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొవిడ్-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి జగన్ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
ఈ నెల 23న విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం గం. 6.20 నిమిషాలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం గం. 8.10 నిమిషాలకు కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైఎస్ జగన్ పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం గం.11.30 కు తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు.