ఉద్యోగ సంఘాలతో నేడు సీఎం జగన్ సమావేశం.. ఇవాళ ప్రకటన వెలువడే అవకాశం...

YS Jagan: ఫిట్‌మెంట్‌పై తగ్గేది లేదంటున్న ఉద్యోగ సంఘాలు...

Update: 2021-12-15 02:30 GMT

ఉద్యోగ సంఘాలతో నేడు సీఎం జగన్ సమావేశం.. ఇవాళ ప్రకటన వెలువడే అవకాశం...

YS Jagan: ఏపీలో పీఆర్సీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉద్యోగ సంఘాలతో విడివిడిగా చర్చలు జరిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. వారి అభిప్రాయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ ఇవాళ భేటీ అయ్యే అవకాశం ఉంది.

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వారికి వివరించారు. ఉద్యోగుల సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సజ్జల.

అధికారుల కమిటీ సిఫార్సులేవీ ఉద్యోగులు ఆశించిన రీతిలో లేవన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. 34 శాతంకు తగ్గకుండా ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్‌మెంట్ రావడం సహజరంగా వస్తోందని.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ అంగీకరించమని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఉద్యోగులు కోరుతున్న విధంగా సీఎం జగన్.. ఫిట్‌మెంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం అనంతరం.. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలతో సజ్జల సమావేశమయ్యారు. పీఆర్సీపై సీఎస్ ఇచ్చిన నివేదికను అంగీకరించాలని కోరగా.. వారు తిరస్కరించారు. సీఎస్ ఇచ్చిన నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను యథాతథంగా అమలు చేయాలని కోరారు. 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 71 హామీలు అమలయ్యే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత సీఎం జగన్‌ను కలిశారు సజ్జల. వారి అభిప్రాయాలను జగన్‌కు వివరించారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత పీఆర్సీపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

Tags:    

Similar News