CM Jagan: జల వివాదంపై ఏపీ సీఎం జగన్ హాట్ కామెంట్స్
CM Jagan: శ్రీశైలంలో 881 అడుగులపైన నీళ్లు ఉంటేనే సీమకు నీళ్లొస్తాయి * 800 అడుగుల్లోపే తెలంగాణ నీటిని వాడుకుంటోంది :జగన్
CM Jagan: తెలుగు రాష్ట్రాల జల జగడం కృష్ణా నది కంటే వేగంగా పరుగులు పెడుతోంది. మొన్నటి వరకు మంత్రులు మాట మాట అనుకున్నారు. ఇప్పుడు ఫస్ట్‌టైం సీఎం జగన్ కూడా పెదవి విప్పారు. తమ వాటా తాము వాడితే తప్పేంటి అంటూ నిప్పులు చెరిగారు. పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నామని చెప్పుకచ్చారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తోన్న జల వివాదంపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మొదటిసారి స్పందించారు. తెలంగాణ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు, కోస్తాంధ్రకు ఎన్ని నీళ్లో, తెలంగాణకు ఎన్ని నీళ్లో అందరికీ తెలుసన్నారు. మొదట్నుంచీ వస్తున్న లెక్కల ప్రకారమే నీళ్ల కేటాయింపులు జరిగాయని గుర్తుచేశారు.
శ్రీశైలంలో 881 అడుగులపైన నీళ్లు ఉంటేనే రాయలసీమకు నీళ్లొస్తాయని సీఎం జగన్ అన్నారు. తెలంగాణ మాత్రం 800 అడుగుల్లోపే నీటిని వాడుకుంటోందని ఆరోపించారు.
శ్రీశైలం నుంచి 800 అడుగుల దగ్గర పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లి తీరుతామని సీఎం జగన్ తేల్చిచెప్పారు. ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం జగన్ కృష్ణా జలాలపై అసత్యాలు, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు వైఎస్‌కు మించిన ద్రోహం తలపెడుతున్నారన్నారు. తెలంగాణా ప్రాజెక్టులు అక్రమమని జగన్ అనడం హాస్యాస్పదం అన్నారు.
కృష్ణా జిలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు రావాల్సి ఉన్నా ఏపీతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఆనాటి సీఎం చంద్రబాబుతో కేవలం 299 టీఎంసీలకే ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు చేశారని బండి సంజయ్ అంటున్నారు.
ఇటు వైఎస్ షర్మిల కూడా పార్టీ ఆవిర్భావ వేదికపై జల వివాదాన్ని ప్రస్తావించారు. అప్పట్లో తీరిగ్గా విందులు చేసుకున్న ముఖ్యమంత్రులు ఇప్పుడు కూర్చొని మాట్లాడటానికి టైం దొరకడం లేదా అంటూ ప్రశ్నించారు.
ఇవాళ జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామని కృష్ణాబోర్డు తెలిపింది. శుక్రవారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని కృష్ణాబోర్డు నిర్ణయించుకుంది. కానీ భేటీ వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని కృష్ణా బోర్డు వాయిదా వేసింది.