AP Cabinet Expansion : అప్పలరాజుకు కంగ్రాట్సే కంగ్రాట్సు.. ఎందుకంటూ జనాల డౌట్సే డౌట్సు !
AP Cabinet Expansion : ఆ ఎమ్మెల్యే ఫోన్, అదే పనిగా కంగ్రాట్స్ మెసేజ్‌లతో మార్మోగుతోంది. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. అనుచరుల హంగామాకు అంతులేదు. ట్వీట్లతో పాటు స్వీట్లు కూడా పంచుకుంటున్నారు. ఎమ్మెల్యేకు కంగ్రాట్స్ కంగ్రాట్స్ అంటూ, ఆయన ఫాలోవర్స్ తెగ హడావుడి చేస్తుంటే, జనాలు మాత్రం డౌట్స్‌తో తికమక అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా తీపికబురు? నిజంగానే ఆయనకు ఏదో వరించబోతోందా? అందుకు వారి లెక్కలేంటి?
వైఎస్ జగన్ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకునేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి నిన్నమొన్నటి దాకా అనేకమంది పేర్లు వినిపించాయి. ధర్మాన ప్రసాదరావు, స్పీీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మరో ఇద్దరి పేర్లు ప్రముఖంగా చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు సడెన్‌గా మరో ఎమ్మెల్యే పేరు తెరపైకి వచ్చింది. అదే ఇప్పుడు సిక్కోలు జిల్లాలో హాట్ టాపికయ్యింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరంటే, సీదిరి అప్పలరాజు..పలాస ఎమ్మెల్యే!
వాస్తవానికి అప్పలరాజు, రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసొస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఖాళీ అయిన రెండు మంత్రి పదవులలో మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో అదే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన అప్పలరాజుతో మోపిదేవి స్థానాన్నీ భర్తీ చేస్తారన్న మాట వినిపిస్తోంది. ఇదిలావుంటే, జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఉద్దాన ప్రాంతానికి పెద్దగా మంత్రివర్గంలో ప్రాధాన్యం లేదు. తెలుగుదేశం హయాంలో మాజీ ఎమ్మెల్యే శివాజీ గతంలో ఓసారి మంత్రిగా చేసినప్పటికీ, అదీ కొద్దినెలలు మాత్రమే. పూర్తిస్థాయిలో ఈ ప్రాంతం నుంచి కేబినెట్‌లో ఎవరికీ చోటు దక్కలేదట. అందుకే అప్పలరాజుకు చాన్స్ ఇస్తారని, అనుచరుల వాదన.
ఇక ఉద్దానం అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది అక్కడి కిడ్నీ సమస్య, జగన్ తన పాదయాత్ర సమయంలో ఉద్దాన ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తానంటూ ఇచ్చిన హామీ సైతం, అప్పలరాజు వర్గంలో కొత్త ఆశలకు రెక్కలు తొడుగుతోందట. ముఖ్యంగా అప్పలరాజు డాక్టర్ కూడా కావడంతో ఆయనకు మంత్రి పదవి వస్తే కిడ్నీ సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తారని, జగన్ ఈ దిశగా ఆలోచన చేశారని, ఇక తమ ఎమ్మెల్యే కాబోయే మంత్రి అంటూ చెప్పుకుంటున్నారట. మరికొందరు అయితే ఇంకో అడుగు ముందుకుసి, అప్పలరాజు అంటే జగన్‌కు చాలా అభిమానమని, అందుకే ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలకు జగన్ తన తొలి పర్యటన పలాసలోనే నిర్వహించారని గుర్తు చేసుకుంటున్నారట.
ఇదిలావుంటే, క్యాబినెట్ సమావేశం సమయంలో అప్పలరాజుకు అమరావతి నుంచి పిలుపు రావడంతో, ఆయన హుటాహుటిన బయలుదేరి అక్కడ జగన్‌ను కలిశారట. అమరావతి వెళ్లే ముందు అప్పలరాజు తన రాజకీయ గురువుగా చెప్పుకునే జిల్లా ముఖ్య నాయకులు ధర్మాన ప్రసాదరావుతో పాటు తమ్మినేని సీతారాంను కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, అప్పలరాజు మంత్రి కావడం ఖాయమని లెక్కలేసుకుంటున్నారట. వరుసగా ఈ పరిణామాలు, సమీకరణలతో అప్పలరాజు అనుచరులు సైతం జిల్లాకు కాబోయే రెండో మంత్రి గారికి శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారట. అయితే ఎమ్మెల్యే కార్యాలయం మాత్రం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తోందట.
ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో, అప్పలరాజును మంత్రి పదవి వరించడం దాదాపు ఖాయమని, ఆయన అనుచరగణం ముందస్తు సంబరాల్లో మునిగిపోతోంది. అయితే, ఆఖరి నిమిషంలోనూ జాబితాలో పేర్లు గల్లంతు అవుతాయి, జత అవుతాయి కూడా. చూడాలి ఎవరిని వరిస్తుందో అమాత్య పదవి.