Andhra Pradesh: కోవిడ్ సెంటర్‌గా మారిన విజ్ఞాన్ విహార్ స్కూల్
Andhra Pradesh: కరోనా కనికరం లేకుండా దూసుకెళ్తుంది. ఎందరో ప్రాణాలను మింగేస్తుంది.
Andhra Pradesh: కరోనా కనికరం లేకుండా దూసుకెళ్తుంది. ఎందరో ప్రాణాలను మింగేస్తుంది. ఇలాంటి కీలక సమయంలో కొందరు మానవతవాదులు కదం తొక్కుతున్నారు. తోటి వారి ప్రాణాలను కాపాడేందుకు నడుం బిగించారు. తమకు తోచిన విధంగా సాయం చేస్తూ వస్తున్నారు. విశాఖ పట్నంలోని విజ్ఞాన్ విహార్ స్కూల్ కూడా కరోనా బాధితుల కోసం మేముసైతం అంటూ ముందుకు వచ్చింది.
మొన్నటి వరకు విద్యాబుద్ధులు చెప్పిన ఆ పాఠశాల ఇప్పుడు మానవత్వాన్ని చాటుతుంది. కోవిడ్ కేర్ సెంటర్‌గా ఎందరో బాధితులకు అండగా నిలబడుతోంది. విశాఖపట్నంలోని గుడిలోవలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కి చెందిన విజ్ఞాన్ విహార్ స్కూల్ కోవిడ్ బాధితులకు ఆరోగ్య కేంద్రంగా మారింది.
ఆర్‌ఎస్‌ఎస్ సేవకులు కరోనా బాధితులకు అండగా నిలబడుతున్నారు. విజ్ఞాన్ విహార్ స్కూల్లో 100 బెడ్స్ ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు ఆడ్మిట్ చేసుకొని ఉచిత వైద్యం, మందులు, బలవర్థకమైన ఆహారం అందిస్తున్నారు.
ఆసుపత్రి అనగానే మెడిసిన్స్ కంపు, భయానక పరిస్థితులు ఉంటాయి. ఈ కోవిడ్ సెంటర్ ప్రకృతి ఒడిని తలపిస్తోంది. చుట్టూ కొండలు మామిడి తోట మధ్యలో కోవిడ్ సెంటర్. బాధితులు హాయిగా సేదతీరుతూ కరోనా నుంచి కోలుకుంటున్నారు. యోగా, మోటివేషనల్ క్లాసులు తీసుకుంటూ పేషెంట్లకు ఉత్సాహం కలిగిస్తున్నారు.
అత్యవసర సేవల కోసం ఇక్కడే రెండు అంబులెన్సులు కూడా ఏర్పాటు చేశారు. ఐతే, ఈ సెంటర్‌లో ఆక్సిజన్ సర్వీసు లేకపోవడంతో ఊపిరి సమస్యలు లేని కోవిడ్ పేషంట్లను మాత్రమే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అందిస్తున్న సేవలను విశాఖ వాసులు కొనియాడుతున్నారు.