ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆ గిరిపుత్రులు ఎదురుచూస్తూ కూర్చోలేదు. చుట్టూ సమస్యలున్నా, కష్టాలు వెంటాడుతున్నా మొండిగా ముందడుగేశారు. తమ సమస్యలకు తామే పరిష్కారం వెతుక్కున్నారు. ఇంతకాలం తమకు చేదోడు వాదోడుగా నిలిచిన పశువులను సైతం అమ్మి తమ గ్రామానికి బాట పరుచుకున్నారు. విజయనగరం జిల్లా గిరిశిఖర గ్రామస్తులు స్వంత నిధులతో ఎర్పాటు చేసుకున్న రహదారిపై HMTV అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్.
చిన్న వర్షానికే చిత్తడిగా మారే గ్రామం ఏ చిన్న ప్రమాదం జరిగినా కనుచూపుమేర కానరాని సహాయం. ఇలాంటి దీన పరిస్థితుల మధ్య మా గోడు వినండంటూ పాలకుల చుట్టూ తిరిగి విసిగివేసారిన ఆ గ్రామస్థులు ఒక్కో రూపాయి పోగుచేసి పాలకులు సైతం సిగ్గుపడేలా గ్రామానికి రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. ఏ చిన్న కష్టమోచ్చినా డోలీలనే ఆశ్రయించి వైద్యం చేయించుకోవల్సిన పిరిస్థితి నెలకొందని, సకాలంలో వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలసిపోయిన సందర్బాలు ఉన్నాయన్న గ్రామస్థులు స్థానిక నేతలు చలించకపోవడంతో విసుగు చెంది తమ సమస్యకు తామే పరిష్కారం వెతికామన్నారు.
గ్రామం మొత్తం ఒక్కటైతే ఎవరికి తోచిన నగదు వాళ్లు అందిస్తే సరిగ్గా ఈ ఆలోచనే గిరిశిఖర గ్రామానికి రహదారిని తెచ్చింది. ఒక్కొక్కళ్లు రెండు వేలనుంచి ఐదు వేల వరకు సొంత నిధులను ఖర్చుచేసి ఐదు లక్షలవరకూ పోగుచేసి గ్రామానికి దగ్గరలో ఉన్న ఒడిశా రహదారికి అనుసంధానంగా ఐదు కిలోమీటర్ల దూరం సోంత నిధులతో రహదారిని నిర్మించుకున్నారు.
కోదమ పంచాయితీ పరిధిలోని పద్నాలు గ్రామాలకు రహదారి కల్సించాలని అది వయా చోర, నంద గ్రామాలకు కలపాలని గ్రామస్తులు ఎన్నో యేళ్లుగా కోరుతున్నారు. ఆ విదంగా రహదారి నిర్మాణం చేపట్టాలంటే ఏడు కిలోమీటర్లు దూరం అటవీ ప్రాంతం గూండా రహదారిని నిర్మించాల్సి ఉంది. గతంలో ఈ రహదారి నిర్మాణం కొరకు టెండర్లు పిలిచినా అటవి సిబ్బంది, పంచాయితి రాజ్ అధికారుల నిర్లక్ష్యంతో రహదారి నిర్మాణం టెండర్ల వరకే పరిమితమయ్యింది. అటవీ అధికారులు తమ భూమి పత్రాలను సమర్పించాలని చెప్పడంతో వారికి తమ భూమి తాలుక పత్రాలు ఇచ్చినా ఇంతవరకు రోడ్డు వేయ్యలేదని దీంతో ఏ చిన్న కష్టం వచ్చినా అటివీ మార్గంలో పన్నెండు కిలోమీటర్లు నడిచి వేళ్ళాల్సి వస్తోందని చోర గ్రామస్తులు వాపోతున్నారు.
కొదమ పంచాయితి పరిధిలోని పదిహేను గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలకు రహదారి లేక అల్లాడుతున్నారు. గ్రామంలో కనీసం విద్య, వైద్యం కోసం పన్నేండు కిలోమీటర్లు అడవిబాటలో నడవాల్సిన పరిస్థితి. సాలూరు మండలంలోని శివారు గిరిశిఖర గ్రామాలకు గత పాలకుల హయాంలో రహదారి మంజూరైనప్పటికీ అప్పట్లో కొంత వరకు పనులు చేపట్టారు. ఆ తరువాత కాంట్రాక్టరకు బిల్లులు నిలిపి వేయడంతో ఆ రహదారి అర్దాంతరంగా నిలిచిపోయి మళ్లీ కొదమ పంచాయితిలోని గ్రామాల ప్రజల ఆశలపై నీళ్ళు చల్లినట్టయ్యింది.
కొదమ గ్రామ సమస్య సోషల్ మీడయా ద్వారా సినీ నటుడు సోనూ సూద్ వరకూ చేరింది. దీంతో ఆ ప్రాంతంలో త్వరలో పర్యటించి వారికి తగిన సహయాన్ని అందిస్తానని ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ తెలపడం ఇటు రాష్ట్ర రాజకీయల్లో సంచలనం కలిగించింది. దీంతో ఆ గ్రామాలకు వెంటనే రహదారి నిర్మించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించారు. సోనూ సూద్ ఒక్క ట్వీట్ తో కొదమ పంచాయితీ పరిధిలోని పదిహేను గ్రామాలను కలుపుతూ వేసే రహదారి నిర్మాణానికి పనులు చకచకా ప్రారంభమయ్యాయి.
గ్రామం మొత్తం ఒక్కటైతే ఏదైనా సాధ్యమేనన్న విషయం గిరిశిఖర గ్రామాలైన కొదమ పంచాయితిలోని ప్రజలు నిరూపించి చూపించారు. ఏళ్ల తరబడి ఎదురుచూపుల వల్ల కాని పనిని ఆ గ్రామాస్థుల ఆలోచన మార్చేసింది. గ్రామాస్థుల కష్టానికి సోషల్ మీడియా తోడవ్వడంతో కొదమ పంచాయితీ పరిధిలోని పద్నాలు గ్రామాల ప్రజల కష్టాలు త్వరలోనే తీరుతాయని ఆశిద్దాం.