Andhra Pradesh: పోలవరంపై నేడు ఢిల్లీలో భేటీ
Andhra Pradesh: ఢిల్లీ వెళ్లిన జలవనరులశాఖ అధికారులు * డీపీఆర్-2పై నేడు ఢిల్లీలో సమావేశం
Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టు డీపీఆర్-2పై నేడు ఢిల్లీలో సమావేశం జరగనుంది. 3 రోజుల క్రితం హస్తిన పర్యటన సందర్భంగా జలశక్తి మంత్రి షెకావత్‌ను కలిసి డీపీఆర్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు. షెకావత్ సూచనల మేరకు ఇవాళ ఏర్పాటైన భేటీలో...సీఎస్, జలవనరులశాఖ అధికారులు పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టులో 2017-18 ధరలకు సంబంధించిన డీపీఆర్2 అంశాలను కొలిక్కి తెచ్చేందుకు ఇవాళ ఢిల్లీలో భేటీ ఏర్పాటు చేశారు. కొత్త డీపీఆర్ ఆమోదం విషయం నెలల తరబడి కేంద్రంలో పెండింగులో ఉంది. కొత్త ధరలు ఆమోదించకపోవడంతో పోలవరం బిల్లులు వెనక్కి తిరిగి వచ్చి నిధుల సమస్య ఏర్పడుతోంది.
డీపీఆర్2పై తాము కొన్ని ప్రశ్నలకు సమాధానాలను కోరామని ఇటీవలే పోలవరం అథారిటీ తెలిపింది. ఆ సందేహాలకు ఇప్పటికే సమాధానాలను పంపినట్లు జల వనరులశాఖ అధికారులు చెప్పారు. డీపీఆర్2 గురించి రాష్ట్రం నుంచి అందించాల్సిన సమాచారం ఏదీ లేదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర జల వనరులశాఖ కొత్త డీపీఆర్‌కు పెట్టుబడి అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపాలి. సాధారణంగా మంత్రి మండలి ఆమోదం అవసరం ఉండదని, గతంలో ఒకసారి దీన్ని మంత్రి మండలికి పంపినందున ప్రస్తుతం అదే సంప్రదాయమూ కొనసాగే పరిస్థితి ఉందని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు.
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జల వనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, పోలవరం అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, కేంద్ర జల సంఘం ఛైర్మన్ హల్దార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.