Affidavit Submitted in High Court: రాజధానిపై అఫిడవిట్.. హైకోర్టుకు సమర్పించిన ఏపీ ప్రభుత్వం
Affidavit Submitted in High Court: రాజధావి వివాదం కొనసాగుతూనే ఉంది.
Affidavit Submitted in High Court: రాజధావి వివాదం కొనసాగుతూనే ఉంది. ఒక పక్క వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేసినా, హైకోర్టు స్టే విధించడంతో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దీనిపై ఒక పక్క సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం తాజాగా రాజధాని ఏర్పాటుపై కేంద్రం స్పందించిన విషయాన్ని ప్రస్తావిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ లో కేంద్రం పేర్కొన్నట్టుగా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదనే విషయాన్ని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని కీలకాంశాలు ' రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే. అదే విషయాన్ని కేంద్రం తన అఫిడవిట్‌లో తెలిపింది. రాజధానితో సహా వివిధ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే విస్తృత అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రానివి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్లే భావించాలి. హోదా గురించి ప్రతి సమావేశంలో అడుగుతున్నాం. ప్రత్యేక హోదా అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్కృత అంశంగా ఉంది' అని పేర్కొంది.
కాగా 'రాజధాని' ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమే అని, అందులో తమ పాత్రేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.