AP Govt on New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో ముందడుగు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

AP Govt on New Districts: కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు సంకల్పించిన ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

Update: 2020-08-23 02:58 GMT

Andhra Pradesh New Districts

AP Govt on New Districts: కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు సంకల్పించిన ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసిన ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపై కమిటీలను ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. దీనిలో భాగంగా తాజాగా పలు విషయాలకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలిచ్చింది. దీనికిగాను ముందస్తుగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటికి సలహాలు, సూచలనిచ్చేందుకు జిల్లా స్థాయిలో అదనంగా కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించింది.

జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి కమిటీ-1, నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి కమిటీ-2, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి కమిటీ-3, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్‌ కమిటీ- 4 ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లాస్థాయి కమిటీలు, రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకానుంది. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈవో అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమికంగా ఆరు నెలల పాటు సచివాలయం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. సబ్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, సచివాలయబాధ్యతలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Tags:    

Similar News