Model Houses: రాష్ట్ర వ్యాప్తంగా పేదల మోడల్ ఇళ్లు ఇదే.. పరిశీలించిన సీఎం జగన్

Model Houses: తక్కువ ఖర్చుతో ప్రతి పేద కుటుంబానికి సొంతగూడు అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది.

Update: 2020-08-20 04:43 GMT
AP Model Houses

Model Houses: తక్కువ ఖర్చుతో ప్రతి పేద కుటుంబానికి సొంతగూడు అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం మోడల్ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనిని పరిశీలించిన ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం బోటు యార్డు వద్ద గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన మోడల్‌ గృహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం పరిశీలించారు. హాలు, బాత్‌ రూమ్, కిచెన్, బెడ్‌ రూమ్, ఫ్లోరింగ్, బయట వరండాను, మెటీరియల్‌ నాణ్యతను నిశితంగా పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి వినియోగించిన మెటీరియల్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు.

– అర్హులైన 30 లక్షల మంది పేదలకు ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను అందజేయడంతో పాటు పక్కా ఇంటిని నాణ్యతతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది.

– 17,000 వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో పక్కా ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతలో 15 లక్షలు, రెండో విడతలో మరో 15 లక్షల ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ఇళ్లు

మోడల్‌ హౌస్‌ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కలిసి మోడల్‌ హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఇంటిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారని, రాష్ట్రంలో ఇదే తరహాలో పేదల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి ఉన్నట్లేనని అన్నారు.

Tags:    

Similar News