Vedadri lift irrigation scheme: కృష్ణా జిల్లాలోని వేదాద్రి వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వేదాద్రి నుంచి మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతిసమీపంలోని, కృష్ణాజిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి ఉందని సీఎం జగన్ అన్నారు. 5 ఏళ్లపాటు అధికారంలో ఉండి కూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే, 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశామని తెలిపారు.
ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని దృఢసంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదని... దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని సీఎం జగన్ అన్నారు. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం. డీబీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా 'వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం' ద్వారా నీరు అందిస్తామని సీఎం వెల్లడించారు. దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు.