ఏపీలో మరో బృహత్తర కార్యక్రమానికి సీఎం శ్రీకారం

* నెరవేరనున్న నిరుపేదల సొంతింటి కల * ఏపీలో పెద్ద సంఖ్యలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం * తూ.గో.జిల్లా కొమరగిరిలో ప్రారంభించనున్న సీఎం జగన్ * 30 లక్షల 75 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

Update: 2020-12-25 05:26 GMT

ఎంతో కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల ఇవాళ నెరవేరబోతోంది. రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మల పేరిట ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. సుమారు 30 లక్షల 75వేల మంది లబ్దిదారులకు ఇళ్లపట్టాలు అందజేయనున్నారు సీఎం. నేటి నుంచి 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

ఇళ్లు లేని నిరుపేదలకు అండగా నిలబడతానని.. సొంతింటి కలను నెరవేరుస్తానని పాదయాత్ర సమయంలో ప్రజలకు హామీ ఇచ్చారు జగన్. ఇప్పుడు ఆ హామీని నిజం చేస్తున్నారు. అర్హులైన 2 లక్షల 60 వేల మందికి టిడ్కో ఇళ్లను కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే మంత్రి బొత్స అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 300 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉండే టిడ్కో ఇళ్ళు ఉచితంగా ఇవ్వనున్నట్టు చెప్పారు. కేవలం ఒక్క రూపాయి తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. 365 చదరపు అడుగులు విస్తీర్ణం ఉంటే 25 వేలు, 430 చదరపు అడుగులు విస్తీర్ణం ఉంటే 50 వేలుగా ధరను నిర్ణయించింది ప్రభుత్వం.

నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను మరో ఏడాదిన్నర లోపు పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News