AP Cabinet : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన సుమారు 2 గంటలపాటు ఈ కేబినెట్ భేటీ జరిగింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడంతోపాటు రైతులకు నగదు బదిలీ విధానంలో బిల్లులు చెల్లించాలనే ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రైతులకు విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.
రైతుకు అందే విద్యుత్ ఎప్పటికే ఉచితమేనని ఆయన అన్నారు. '' ఒక్క కనెక్షన్ తొలగించబోము, ఉన్న కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తాం. విద్యుత్ కనెక్షన్ ఉన్న రైతు పేరుమీద ప్రత్యేక ఖాతా తెరుస్తాం. మీటర్ల ఖర్చు డిస్కమ్‌లు, ప్రభుత్వాలే భరిస్తాయి. ప్రభుత్వం ఖాతాల్లో జమ చేసే డబ్బును రైతులే డిస్కమ్‌లకు చెల్లిస్తారు'' అని సీఎం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ పథకం అమలు కానున్నట్లు వెల్లడించారు.