చంద్రబాబు రాకతో అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్.. పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో అమరావతిలో రియల్ ఏస్టేట్ కు ఊపు వచ్చింది.

Update: 2024-06-08 13:45 GMT

చంద్రబాబు రాకతో అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్.. పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో అమరావతిలో రియల్ ఏస్టేట్ కు ఊపు వచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయి. 2014లో టీడీపీ సర్కార్ అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి అంతా రివర్సైంది. లక్షలు పెట్టుబడులు పెట్టి ఇక్కడ భూములు కొనుగోలు చేసినవారంతా తట్టాబుట్టా సర్దుకున్నారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అమరావతిలో రియల్ ఏస్టేట్ కు పూర్వ వైభవం వస్తుందని నమ్ముతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించడమే తమ విధానమని టీడీపీ, బీజేపీ, జనసేన ప్రకటించాయి. ఈ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుకానున్నందున అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

అమరావతిలో చంద్రబాబు అప్పుడు ఏం చేశారు?

ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దాలని చంద్రబాబు సంకల్పించారు. 2014లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతిలో రాజధాని కోసం శంకుస్థాపన చేశారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అభివృద్ది చేసేందుకు రూ. 50 వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. అమరావతిలో తొమ్మిది థీమ్ సిటీలు, 27 టౌన్ షిప్ ల నిర్మాణం కోసం బ్లూప్రింట్ లను సిద్దం చేశారు. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుండి రూ. 500 మిలియన్లతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు పార్టీ ఓటమి పాలైంది. ఈ పరిణామం అమరావతి వాసులకు ఇబ్బందులు తెచ్చింది.

అమరావతిలో భూముల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

వైఎస్ జగన్ 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. అమరావతి శాసన, కర్నూల్ లో న్యాయ, విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు ఆందోళన చేశారు. ఈ డిమాండ్ కు వైఎస్ఆర్సీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామాలతో అమరావతిలో భూముల ధరలు తగ్గాయి.

2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సెంట్ భూమి ధర రూ. 20 నుండి రూ. 25 లక్షలకుపైగా ఉండేది. అయితే రాజధానికి సమీప గ్రామాల్లో ఈ ధర మరింత ఎక్కువగా ఉండేది. రాజధానికి దూరం పెరిగితే ఈ ధర కొంచెం తక్కువగా ఉండేది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంట్ భూమి ధర రూ. 10 లక్షల వరకు పడిపోయింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినందున మళ్లీ ధరలు పెరుగుతున్నాయి.

సీఆర్డీఏ పరిధిలో ప్రస్తుతం గజం ధర రూ. 12 వేల నుండి రూ. 16 వేలకు పెరిగింది. రానున్న రోజుల్లో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని రియల్ ఏస్టేట్ వ్యాపారి జగదీష్ అభిప్రాయపడ్డారు. అమరావతిలోనే రాజధానికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతిలో రాజధాని కోసం నిర్మాణాలు చేసే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.

రాజధాని గ్రామాల్లో ఊపందుకోనున్న భూ క్రయ విక్రయాలు

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నందున అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలు పెరిగే అవకాశం ఉందని రియల్ ఏస్టేట్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

రాజధానిపై టీడీపీ సర్కార్ విధానపరమైన నిర్ణయం తీసుకొనేలోపుగానే ఈ ప్రాంతంలోని భూములపై పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని రియల్ వ్యాపారులు చెబుతున్నారు. అమరావతిలో ప్రభుత్వం రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణాన్ని చేపడితే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఏస్టేట్ ఏజంట్ కాళీ అభిప్రాయపడ్డారు.

తాడికొండ సబ్ రిజిస్ట్రేషన్ లో సాధారణంగా ప్రతి రోజూ 50 నుండి 60కిపైగా రిజిస్ట్రేషన్లు అవుతాయని ఏజంట్లు చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతి రోజూ 70కిపైగా రిజిస్ట్రేషన్లు అవుతాయని చెప్పారు. మరో నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

రాజధాని పరిసర నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధులు ఎవరూ విజయం సాధించలేదు. ఈ ప్రాంతంలో టీడీపీ కూటమి అభ్యర్ధులు గెలుపొందారు. చంద్రబాబు మరోసారి సీఎం అయితే తమకు మంచి రోజులు వస్తాయని భావించిన ఈ ప్రాంతవాసులు ఏకపక్షంగా తీర్పిచ్చారు.

Full View


Tags:    

Similar News