ఇద్దరు ప్రత్యర్థులు కలిశారు మరి విజయానికి కలవనిదేంటి?

Update: 2019-07-03 12:15 GMT

కళ్లు ఉరిమి చూసుకునే ఇద్దరు ప్రత్యర్థులు కలిశారు. ఎదురుపడితే మరో యుద్ధమే జరిగే నేతలు, చేతులు కలిపారు. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ఇరువురి విజయం కోసం ఒకే వేదిక ఎక్కారు. మొన్నటి వరకు వేరువేరు పార్టీల్లో ఉంటూ పానిపట్‌ యుద్ధంలా తలపడే నేతలు, ఒకే పార్టీలో చేరి, మేము కలిశాం, మీరూ కలవండని అనుచరులకు పిలుపునిచ్చారు. ఇక ఇద్దరు ఉద్దండులు కలిశారు, గెలుపు పక్కా అని చంద్రబాబు కూడా చాలామందితో చెప్పుకున్నారు. సీన్‌ కట్ చేస్తే, అక్కడ ఆ ఇద్దరిలో ఒక్కరూ గెలవలేదు. దారుణంగా ఓడారు. మరి ఇద్దరు శత్రువులు కలిసినా, కలవనిదేంటి...ఉద్దండ నాయకులు చెట్టాపట్టాలేసుకున్నా, చేతులు కలపనిది ఎవరు...? ఫ్యాక్షన్ నేలపై నేతలు రాసిన ఫిక్షన్‌కు, ఓటర్లు ఎందుకంత పర్‌ఫెక్ట్‌గా రియాక్షన్‌ ఇచ్చారు?

కడప జిల్లాలో ఫ్యాక్షన్‌, వర్గరాజకీయాలకు పెట్టింది పేరు జమ్మలమడుగు నియోజకవర్గం. ఇక్కడ రెండు కుటుంబాల మధ్యే దశాబ్దాలుగా పోరు. పార్టీలు కాదు వ్యక్తులే ఇక్కడ రాజకీయాలను శాసిస్తారు. ఓటర్లు కూడా ఇలాంటి తీర్పులే ఇస్తుంటారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం భిన్నమైన తీర్పిచ్చి, సరికొత్త వాణి వినిపించారు. పొన్నపురెడ్డి, చదిపిరాళ్ల కుటుంబాలు. దశాబ్దాల వైరం ఈ రెండు కుటుంబాలది. మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇద్దరూ ఉప్పూ నిప్పు. వీరిద్దరూ ఎదురుపడితే, కార్యకర్తల మధ్య పెద్ద యుద్ధమే.

అయితే ఈ ఎన్నికల్లో వైరం పక్కనపెట్టి వీరిద్దరూ కలిశారు. దశాబ్దాల శత్రుత్వాన్ని వదిలి చేతులు కలిపారు. కడప జిల్లాలో జగన్‌ మోహన్‌ రెడ్డి హవాకు చెక్‌పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో, చిరకాల ప్రత్యర్థులను కలపాలన్న వ్యూహంతో చంద్రబాబు ఈ ప్రయోగం చేశారు. దీనికితోడు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలాంటి కీలక నేతలను మోహరించి, కడపలో జగన్‌‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది కూడా బాబు స్ట్రాటజీగా కనపడింది. అయితే ఎన్నికల ముందు కొట్టుకుని, ఎన్నికల కోసం చేతులు కలపడాన్ని అవకాశవాదంగా భావించారు జనం. అందుకే నాయకులకు ఊహకందని తీర్పిచ్చి, సంచలనం సృష్టించారు.

జమ్ములమడుగు నుంచి వైసీపీ అభ‌్యర్థిగా గెలిచి, తర్వాత టీడీపీలో చేరి, మంత్రయ్యారు ఆదినారాయణ రెడ్డి. ఈసారి ఆయన జమ్ములమడుగును వదిలి ఏకంగా కడప ఎంపీగా పోటీ చేశారు. అదే సమయంలో ఈయన చిరకాల ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి జమ్ములమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మొన్నటి వరకూ ఎదురుపడితే యుద్ధమే అన్నట్టుగా వ్యవహరించిన ఈ నేతలు, ఎన్నికల కోసం ఒకే వేదిక పంచుకున్నారు. పక్కపక్కనే కూర్చుని, ఒకరికోసం మరొకరు ఓట్లు అభ్యర్థించారు. పగలు ప్రతీకారాలు మాని, ఇద్దరికీ ఓట్లేయాలని అడిగారు. ఓట్ల బదలాయింపు కోసం విస్తృతంగా సభలూ, సమావేశాలు నిర్వహించారు. కానీ ఓట్లు మాత్రం బదిలీ కాలేదు. ఇద్దరి ఓటమే అందుకు నిదర్శనం.

జమ్ములమడుగు నుంచి వైసీపీ తరపున వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధమున్న డాక్టర్ సుధీర్ రెడ్డి బరిలోకి దిగారు. ఒకవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం మరో వైపు ఉరకలేసే ఉత్సాహం పార్టీలకు కాకుండా వ్యక్తులకే ప్రాధాన్యమిచ్చే ఇక్కడి ఓటర్లు ఈ పర్యాయం ఎలాంటి తీర్పు ఇస్తారన్న ఆసక్తి ఈ ఎన్నికల్లో మరింత అధికంగా కనిపించింది. జమ్ములమడుగులో ఎవరు గెలుస్తారని రాష్ట్రమంతా చర్చ జరిగింది. ఇద్దరు ప్రత్యర్థులు కలిశారు కాబట్టి, జమ్ములమడుగు తమదేనని చంద్రబాబు కూడా ధీమాగా ఉన్నారు. వైసీపీలో కీలక నేతలు కూడా, జమ్ములమడుగుపై వైసీపీ విజయం అనుమానమేనని జగన్‌ వద్ద ప్రస్తావించారట. కానీ జమ్ములమడుగులో ఎగిరేది వైసీీపీ జెండానేనని జగన్‌ కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో అవంతి శ్రీనివాస్ లాంటి నేతలే అవాక్కయ్యారట. ఫలితం చూసి, జగన్‌ ఆత్మవిశ్వాసాన్ని ఇప్పుడు కొనియాడుతున్నారట.

పేరుకు మాత్రం ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలిశారని, క్షేత్రస్థాయిలో అవే పగలూ, ప్రతీకారాలు కొనసాగాయన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. ఇద్దరికీ బలమైన క్యాడర్ ఉందని, ఓట్ల బదలాయింపుతో విజయం నల్లేరుపై నడకేనని టీడీపీ అధినేత భావించారు. అయితే గ్రౌండ్‌లెవల్‌లో ఇరు వర్గాలు కలిసి పనిచెయ్యలేదన్నది ఎన్నికల అనంతరం నిరూపితమైంది. ఇరువురి కలయికే ఎన్నికల్లో దెబ్బతీసిందని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా స్టీల్ ప్లాంటు విషయంలోను నాలుగున్నరేళ్లు మౌనంగా ఉండి, చివర్లో శంకుస్థాపన చెయ్యడం కూడా నష్టం కలిగించిందన్న వాదన ఉంది. గండికోట ప్రాజెక్టును కూడా దివంగత వైఎస్ఆర్ చాలా వరకు పూర్తి చేశారు. కానీ కృష్ణా జలాలను తీసుకువచ్చింది మాత్రం తామేనని టిడిపి చెప్పుకునే ప్రయత్నం చేసినా, ప్రజలు పెద్దగా నమ్మలేదు. దీనికితోడు ప్రభుత్వ పథకాలు కూడా టిడిపికి పెద్దగా కలిసి రాలేదనడానికి ఫలితాలే నిదర్శనం.

మొత్తానికి బద్దశత్రువులు చేతులు కలిపినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాత్రం కలవలేదు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి జగన్‌పై చేసిన ఆరోపణలను కూడా జనం హర్షించలేదని అర్థమవుతోంది. మొత్తానికి వ్యక్తులను చూసి ఓట్లేసే జమ్ములమడుగు జనం, ఈసారి పార్టీని చూసి తీర్పిచ్చారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

Full View

Tags:    

Similar News