Andhra Pradesh: పులిచింతల డ్యామ్ 16వ గేటుకు సాంకేతిక సమస్య
* వెల్డింగ్ ఊడి కిందపడిన క్రస్ట్‌గేట్ * దిగువకు పరుగులు తీస్తున్న వరద నీరు * ఎమర్జెన్సీ గేటు ఏర్పాటుకు అధికారుల యత్నం
Andhra Pradesh: గుంటూరు జిల్లా పులిచింతల డ్యామ్ 16వ గేట్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. వెల్డింగ్ ఊడిపోవడంతో క్రస్ట్‌గేట్ కిందపడిపోయింది. దీంతో ఆ గేట్ నుంచి వరద నీరు వేగంగా దూసుకొస్తోంది. సమాచారం అందుకున్న డ్యామ్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకొని మిగతా గేట్లపై ఒత్తిడి పడకుండా 7గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక సాంకేతిక సమస్య తలెత్తిన 16వ గేట్ దగ్గర ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో గేటు ఏర్పాటు కాస్త కష్టంగా మారింది. దీంతో ప్రాజెక్ట్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు పోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రాజెక్ట్‌పైకి ఎవరినీ అనుమతించడంలేదు.
ఇదిలా ఉండగా పులిచింతల డ్యామ్ గేట్ ఊడిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి వరద ముప్పు పొంచి ఉంది. పులిచింతల నుంచి దిగువకు వస్తున్న నీరు ప్రకాశం బ్యారేజీకి నేరుగా వచ్చి చేరుతోంది. 8 నుంచి 12 గంటల్లోపు 4 నుంచి 5 క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీకి వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీకి వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఏ క్షణమైనా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో నదిపరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల డ్యాం దగ్గర ప్రస్తుతం ఔట్ ఫ్లో 2లక్షల 804 క్యూసెక్కులు, ఇన్‌ఫ్లో లక్షా 10వేల క్యూసెక్కులుగా ఉంది. ఇక ఇటు ప్రకాశం బ్యారేజీ దగ్గర ఔట్ ఫ్లో 33వేల 750 క్యూసెక్కులు ఉండగా ఇన్ ఫ్లో 41వేల 717 క్యూసెక్కులు ఉంది.