ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై గులాబీ బాస్ కేసీఆర్ వేగం పెంచారు. చెప్పినట్లుగానే ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఎల్లుండి నుంచి రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, మాయావతి, అఖిలేష్ యాదవ్‌ను కలవనున్నారు. అదే సమయంలో ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి పలు ప్రాంతాలను, దేవాలయాలను సందర్శించనున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఫెడరల్ ఫ్రంట్ ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవెగౌడలతో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరిపిన కేసీఆర్ మరోసారి ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 23నుంచి రాష్ట్రాల టూర్‌కు శ్రీకారం చుట్టిన గులాబీ అధినేత ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమబెంగాల్, ఢిల్లీలో పర్యటించనున్నారు.
23న ఉదయం 10గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయల్దేరనున్న కేసీఆర్ శారదా పీఠాన్ని సందర్శించి, రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం చేసి, ఆ తర్వాత విశాఖ నుంచి ఒడిషా రాజధాని భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరుపుతారు. 23న రాత్రి ఒడిషా సీఎం అధికార నివాసంలోనే బస చేయనున్న కేసీఆర్ 24న ఉదయం కోణార్క్ఖ దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం జగన్నాథ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం భువనేశ్వర్ నుంచి కోల్‌కతా వెళ్లనున్న కేసీఆర్ సాయంత్రం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరుపుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక 25నుంచి మూడ్రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. మర్యాదపూర్వకంగా ప్రధాని మోడీని కలవనున్న కేసీఆర్ తెలంగాణ సమస్యలపై, పెండింగ్ ఇష్యూస్‌పై మెమొరాండం ఇవ్వనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఇక కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కూడా కేసీఆర్ కలవనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ టూర్‌లోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోనూ సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరపనున్నారు.