తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కుతోంది. అధికార టీఆర్‌ఎస్ అప్పుడే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఏకంగా విలీనం ఎత్తుగడనే తెరపైకి తీసుకొస్తోంది. 2014 ఎన్నికల తర్వాత టీటీడీఎల్పీ విలీన ప్రతిపాదన చేసి షాకిచ్చిన గులాబీ పార్టీ ఈసారి అదే అస్త్రాన్ని కాంగ్రెస్‌పై ప్రయోగిస్తోంది. మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గులాబీ గూటికి చేరడంతో మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ లేఖ ఇప్పించి సంచలనానికి తెరలేపింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ప్రకంపనలు రేపుతోంది. శత్రుశేషం మిగిలి ఉండకూడదనే ఎత్తుగడను అధికార టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది. 2014 ఎన్నికల తర్వాత టీడీపీని దాదాపు ఖాళీ చేసిన గులాబీ పార్టీ ఈసారి కాంగ్రెస్‌పై గురిపెట్టింది. రెండు సభల్లోనూ కాంగ్రెస్ సభ్యులు లేకుండా చేసి, ఏకచక్రాధిపత్యం యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2014 తర్వాత టీ-టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారందరినీ గులాబీ గూటికి చేర్చుకుని, తెలంగాణ టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీలో బులెటిన్ సైతం రిలీజ్ చేయించిన అధికార పక్షం ఇప్పుడు అదే అస్త్రాన్ని కాంగ్రెస్‌పై ప్రయోగిస్తోంది. శాసన మండలిలో కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యులు ఉండగా, వారిలో ఇద్దరు గతంలోనే టీఆర్‌ఎస్ గూటికి చేరారు, ఇక ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. అలా మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గులాబీ గూటికి చేరిపోవడంతో మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ ఛైర్మన్‌కు విజ్ణప్తి చేశారు.
అయితే ఈ ప్రతిపాదనను తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖకు విలువ లేదని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ అన్నారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలంటూ స్వామిగౌడ్‌కు విజ్ణప్తి చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు వచ్చి కనీసం పది రోజులు కూడా తిరగకుండానే ఇద్దరు ఎమ్మెల్సీలు భారీ షాకిచ్చారు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారో ఎవరు గోడ దూకుతారో తెలియని పరిస్థితి. పైగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరతామని ఫోన్లు చేస్తున్నారంటూ స్వయంగా కేసీఆరే చెప్పడంతో మరి అధికార పార్టీ ఎత్తుగడలను కాంగ్రెస్ ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడాలి.