YS Sharmila: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం
YS Sharmila: వరంగల్ జిల్లా శంకరమ్మ తాండా నుంచి ప్రారంభం
YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఆపిన చోట నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు షర్మిల... 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన షర్మిల... ఇప్పటికే మూడు వేల కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. నర్సంపేట డివిజన్‌లో 2022 నవంబర్‌లో ప్రజాప్రస్థానం మొదలయింది. డివిజన్‌లోకి అడుగుపెట్టిన నాటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో బీఆర్ఎస్ శ్రేణులు నవంబర్ 28న చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద పాదయాత్ర బస్సును దగ్ధం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా... పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం భారీ రాజకీయ దుమారమే రేగింది.
నర్సంపేట ఘటన నేపథ్యంలో షర్మిల పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో యాత్ర ఆగిపోయింది. తాజాగా వరంగల్ పోలీసులు షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మతాండా నుంచి షర్మిల ఇవ్వాళ మధ్యాహ్నం పునఃప్రారంభం కానుంది.
షర్మిల పాదయాత్రకు పోలీసులు కండిషన్లతో కూడిన అనుమతినిచ్చారు. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించుకోవడానికి వరంగల్ సీపీ రంగనాథ్ అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతినిచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి వివాదస్పద వాఖ్యలు చేయవద్దని షరతులు విధించారు. ర్యాలీల్లో క్రాకర్స్ కాల్చొద్దని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించొద్దంటూ అనేక నిబంధనలతో పాదయాత్రకు అనుమతినిచ్చారు. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్ధన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట, స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గడ్, నర్మెట్ట, జనగామ, దేవురుప్పల, పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది. ప్రజాప్రస్థానం ముగింపు సభ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరగనుంది.
ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభానికి ముందు వైఎస్ షర్మిల రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో షర్మిల భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో వైఫల్యాలపై గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ నుంచి నేరుగా షర్మిల పాదయాత్రకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం కానుంది.