లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిలో చదువుకున్న వారే ఎక్కువ!

Update: 2020-04-25 04:32 GMT

కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ను ప్రజలు పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు పరుస్తున్న రోజు రోజుకు ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి. జిల్లాల్లో ఉన్న ప్రజలు లాక్‌డౌన్ కు సహాకరిస్తుంటే పట్టణాల్లో మాత్రం లాక్‌డౌన్ ఆశయాన్ని నీరు గారుస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి జనాలు వస్తున్నారు. అయితే లాక్‌డౌన్ ను ఎంతకాలం కొనసాగించాలి..? అనే అంశంపై ఆన్‌లైన్‌లో తెలంగాణ పోలీసులు ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. అందులో లాక్ డౌన్ సమర్థిస్తూ దాదాపుగా 94 శాతం మంది మద్దతు తెలిపారు.

కానీ, కేవలం 6 శాతం మంది మాత్రం లాక్‌డౌన్ ఎందుకు పెట్టారు..? దాని ఉద్దేశం ఏంటి..? అన్న దానిపై తమకు ఐడియానే లేదని సమాధానమిచ్చారు. వీరితోనే అసలు సమస్య అని పోలీసులు పేర్కొన్నారు. వీరికి కనీసం లాక్‌డౌన్ సమయాలపై కూడా అవగాహాన లేదని వారు తెలిపారు. అందుకే, ఇష్టానుసారంగా వేళపాళా లేకుండా బయటకు వస్తున్నారు. ఇలా అనవసరంగా బయటకు వచ్చిన వారు వైరస్ క్యారియర్లుగా మారితే కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

మరో వైపు లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్న వారిలో జిల్లాల వాసులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ముందున్నా నగరాలు, పట్టణాల్లో కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి కేసులు గ్రేటర్ పరిధిలో మరీ అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లమీదకు వచ్చిన లక్షకు పైగా వాహనాలు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ప్రభుత్వ లాక్‌డౌన్ ఉల్లంఘిస్తున్న వారిలో అధిక శాతం చదువుకున్న యువతే కావడం మరో విశేషం. ఉల్లంఘనల శాతం జిల్లాలో 30శాతంగా ఉండగా, హైదరాబాద్ లో మాత్రం 50శాతంగా ఉంది. ఇక హైదరాబాద్ పాతబస్తీలో లాక్‌డౌన్ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. అసలు లాక్‌డౌన్ అంటే ఐడియా లేనివారిలో ఇక్కడే అధికంగా ఉన్నారు. ఆరుశాతం మంది కరోనా వైరస్ ను మోసుకెళ్లే క్యారియర్లుగా మారే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం 7గంటల నుంచి 12 గంటల వరకు కిరాణా, ఇతర నిత్యావసర సరుకుల వ్యాపారాలకు అనుమతి ఉంది. కానీ, ఇదే ఆసరాగా చేసుకుని చాలామంది సామాజిక దూరాన్ని గాలికి వదిలేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ మొదటి స్థానంలో ఉన్నా, ఇక్కడ కొందరు ప్రజలు ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన జిల్లాల్లో పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతుంటే ఇక్కడ అలాంటి పరిస్థితులు కనిపించకపోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అసలు లాక్‌డౌన్ లక్ష్యం నెరవేరకుండా పోతుందని, ఆయా ఏరియాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News