TRS MLA Tests Positive : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వైరస్ బారిన పడ్డారు. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఆయన హైదరాబద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల సురేందర్ కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(మంగళవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,763 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 08 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 95,700కి చేరింది. మృతుల సంఖ్య 719కి పెరిగింది. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 73,991కి చేరింది. ప్రస్తుతం 20,990 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఒక్క రోజే 24542 టెస్టులు చేయగా 1,763 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,97,470 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.