కామారెడ్డి మునిసిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై బోధన్ మునిసిపల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సోమవారం దాడి చేశారు. మహిళా ఉద్యోగి డెస్క్ వద్దకు వచ్చిన రామకృష్ణ తాను కాల్ చేస్తుంటే ఎందుకు సమాధానం ఇవ్వడం లేదంటూ ముందుగా గొడవపెట్టుకున్నాడు. ఆ తరువాత ఉన్నపలంగా ఆమెపై దాడికి దిగాడు. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు చెప్పిన పూర్తివివరాల్లోకెళితే రామకృష్ణ కూడా పూర్వం కామారెడ్డి మునిసిపల్ కార్యాలయంలో విధులు నిర్వర్తించేవాడని తెలిపింది. కొన్ని రోజుల క్రితమే బోధన్‌కు బదిలీ అయ్యారని పేర్కొంది. అతను తరుచూ తనకు కాల్ చేస్తున్నాడని కాల్స్ కు సమాధానం ఇవ్వకపోవడం, అతని నంబర్‌ను బ్లాక్ చేయడం వల్ల రామకృష్ణ తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. అనంతరం మహిళా ఉద్యోగి కామారెడ్డి పోలీసులను సంప్రదించి సీనియర్ అసిస్టెంట్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అధికారిని అరెస్టు చేశారు. ముఖానికి గాయాలైన రోజాను చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఇద్దరు అధికారులకు ఇంతకుముందు ఏదైనా వివాదం ఉందా అని నిర్ధారించనున్నారు. వీరిద్దరి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే మహిళా సంక్షేమ సంఘాలు, మునిసిపల్ కార్యాలయ ఇతర అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం సరిగ్గా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ డిప్యూటీ మేనేజర్ ని మహిళా ఉద్యోగి ముసుగు ధరించమని కోరింది. దీంతో కోపం తెచ్చుకున్న అధికారి అక్కడే ఉన్న ఓ వస్తువుతో ఆమెపై దాడి చేసారు.